Galwan : గల్వాన్‌లో ఏడాది తర్వాత కూడా..!

 2020 జూన్‌ 15న దాదాపు 45 ఏళ్ల తర్వాత వాస్తవాధీన రేఖ రక్తమోడింది.16 బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 15 Jun 2021 15:53 IST

 మోహరించి ఉన్న ఇరు దేశాల సేనలు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 2020 జూన్‌ 15న దాదాపు 45 ఏళ్ల తర్వాత వాస్తవాధీన రేఖ రక్తమోడింది.16 బిహార్‌ రెజిమెంట్‌కు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ఏడాది పూర్తికావడంతో సైన్యం నేడు వారికి నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కోర్‌ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మేజర్‌ జనరల్‌ అశోక్‌ కౌశిక్‌ లేహ్‌లోని యుద్ధస్మారకం వద్ద నివాళి అర్పించారు. ‘‘దేశ భూభాగాన్ని కాపాడేందుకు అత్యంత ఎత్తైన పర్వత శిఖరాల్లో వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేశారు. వీరి త్యాగాలను దేశప్రజలు ఎన్నటికి మరిచిపోరు’’ అని పేర్కొన్నారు. మరోపక్క ఏడాదిపాటు 11 విడతలు కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరిగినా సమస్య పరిష్కారం కాలేదు. 
 
వేసవి రాగానే పెరిగిన దళాల కదలికలు..

వేసవిలో కొంచెం పరిస్థితి అనుకూలించగానే చైనా మూకలు మళ్లీ ఆయుధాలతో వాస్తవాధీన రేఖ వెంట చేరిపోయాయి. గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్‌, దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌ల‌లో  చైనా దళాల తిష్ట కొనసాగుతోంది. ఇటీవల చైనా దళాలు యుద్ధవిన్యాసాలు నిర్వహించాయి. దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌  వివాదం కాస్త పాతది. దెప్సాంగ్‌లో 2013, 2017ల‌లో కూడా ఉద్రిక్తత‌ నెలకొంది.  ప్రస్తుతం ఇక్కడ 10, 11, 11ఏ, 12, 13 పెట్రోలింగ్‌ పాయింట్లకు భారత దళాలు వెళ్లకుండా చైనా సేన‌లు అడ్డుకొంటున్నట్లు ది ప్రింట్‌ కథనం పేర్కొంది.  

భారత్‌ వేగాన్ని తగ్గించేందుకు..

చైనా సరిహద్దుల వెంట అనుసరించే వ్యూహాన్ని ఏ2ఏడీ అంటారు.  అంటే ‘యాంటీ యాక్సెస్‌- ఏరియా డినైల్‌’..! ప్రస్తుతం దక్షిణ చైనా సముద్రంలో కూడా ఇదే వ్యూహాన్ని పాటిస్తోంది. తొలుత ప్రత్యర్థులను అడ్డుకొనేందుకు తన వద్ద ఫైటర్‌ జెట్లు, యుద్ధనౌకలు, బాలిస్టిక్‌ క్షిపణులు, క్రూజ్‌ క్షిపణలను కీలక లక్ష్యాలపైకి గురిపెడుతుంది. తన కార్యకలాపాలు జరిగే ప్రదేశంలోకి శత్రువులు రాకుండా చేయడం కోసం ఇలా చేస్తుంది. ఇక దీనికి సమీప ప్రాంతాల్లో స్నేహపూర్వక నియంత్రణతో శత్రువుల కదలికలను అదుపు చేస్తుంది. 

ఏడాదిగా అలుపెరుగని వాయుసేన..

గల్వాన్‌లో ఘర్షణ చోటు చేసుకోన్న విషయం తెలియగానే వాయుసేన యుద్ధవిమానాలు హుటాహుటిన లద్ధాఖ్‌ దిశగా పయనం అయ్యాయి. నాటి నుంచి ఏడాది పాటు అలుపెరుగకుండా సేవలు అందిస్తున్నాయి. దళాలు, రేషన్‌,పరికరాలు, ఆయుధాల తరలింపులో ఐఏఎఫ్‌ కీలక పాత్ర పోషించింది. అంతేకాదు వాయుసేనకు చెందిన రాడార్లు, క్షిపణులను కూడా లద్ధాఖ్‌కు తరలించారు. భారత్‌కు చెందిన ఏఎన్‌32,సీ130జే,సీ-17 వంటి భారీ రవాణా విమానాలతోపాటు అపాచీ, చినూక్‌ హెలికాప్టర్ల సేవలను వాడుకొంది. వివిధ  స్థావరాల నుంచి వాయుసేన బలగాలను సిద్ధం చేశారు. ఎందుకంటే ఎటు అవసరమైతే అటు వైపు వినియోగించుకోవచ్చని ప్రభుత్వ యోచన.  

భారత్‌ 2019లోనే వాస్తవాధీన రేఖ వద్ద ఘర్షణలను ఎలా ఎదుర్కోవాలనే ప్రణాళిక సిద్ధం చేసుకొన్నట్లు సమాచారం. అందుకే గల్వాన్‌ ఘర్షణ జరిగిన గంటల్లో వివిధ ఎయిర్‌ బేస్‌ల నుంచి లద్దాఖ్‌ సమీపానికి ఫైటర్‌ జెట్‌లు చేరుకొన్నాయి. వెంటనే కాంబాట్‌ ఎయిర్‌ పెట్రోల్స్‌ (సీఏపీ)కూడా ప్రారంభించాయి. చైనా కదలికలు తెలుసుకొనేందుకు నిరంతరం డ్రోన్ల నిఘాను ఏర్పాటు చేశారు. గత జులైలో రఫేల్స్‌ భారత్‌కు రాగానే వెంటనే వాటిని వాస్తవాధీన రేఖ వద్దకు తరలించారు.    

పోటాపోటీగా గగనతల రక్షణ వ్యవస్థలు..

చైనా వద్ద గగనతల రక్షణ వ్యవస్థ బలంగా ఉండగా.. వాయుసేన కొంత బలహీనంగా ఉంది. ఆ దేశ వైమానిక స్థావరాలు ఎత్తులో ఉండటంతో ఫైటర్‌ జెట్‌లు  హిమగిరుల్లో పూర్తి సామర్థ్యం మేరకు పనిచేయలేవు. ఆయుధాలు, చమురు  పరిమితంగా తీసుకొని గాల్లోకి ఎగరాల్సి ఉంటుంది. 2020 జులై నాటికి చైనా ఐదు జె-20 స్టెల్త్‌ జెట్‌ విమానాలను అక్కడ మోహరించింది. వాటిని ఈ ఏడాది మార్చి వరకు కొనసాగించింది. దీంతోపాటు 10 వరకు హెచ్‌క్యూ 9,22,16 రకాల ఎస్‌ఏఎం (సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌) వ్యవస్థలను ఏర్పాటు చేసింది. చైనా వైపు భౌగోళిక ప్రాంతం వీటి మోహరింపునకు అనుకూలంగా ఉంటుంది. 

భారత్‌ కూడా దీనిని అధిగమించడానికి వాయుసేకు చెందిన ఎస్‌ఏఎంలను తరలిచింది. భారత వాయుసేనకు చెందిన నిపుణులు క్షేత్ర స్థాయిలో  సైన్యం, ఐటీబీపీ సిబ్బందితో కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. వాయుసేన పరికరాలను మోహరిస్తేనే వీరిని తరలిస్తారు..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని