Aadhaar-PAN: ఆధార్‌-పాన్‌ లింకు డెడ్‌లైన్‌ పొడిగించండి.. మోదీకి కాంగ్రెస్‌ లేఖ

ఆధార్‌-పాన్‌ అనుసంధాన (Aadhaar-PAN linking) గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదురి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కి లేఖ రాశారు.

Published : 22 Mar 2023 01:40 IST

దిల్లీ: ఆధార్‌-పాన్‌ (Aadhaar-PAN) అనుసంధానానికి విధించిన తుది గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి (Narendra Modi) లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదురి లేఖ రాశారు. దీంతోపాటు ఇప్పటికే విధిస్తున్న రూ.1000 అపరాధ రుసుమును కూడా తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి మార్చి 31తో గడువు ముగుస్తోన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈ లేఖ రాశారు.

‘దేశంలో అత్యధిక శాతం మంది మారుమూల ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం అంతంత మాత్రమే. ఇదే అదనుగా భావించి కొందరు దుర్మార్గులు అమాయకమైన గ్రామీణ ప్రాంతాల ప్రజల నుంచి ఫీజు రూపంలో దోపిడీకి పాల్పడుతున్నారు. ఇవన్నీ సామాన్యులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్‌-పాన్‌ లింక్‌ చేసుకునే వారికి ఉచితంగా సహాయం చేయాలని పోస్టాఫీసులకు ఆదేశాలు ఇవ్వాలి. వీటితోపాటు తుది గడువును కూడా ఆరు నెలలు పెంచేలా ఆర్థిక శాఖలోని రెవెన్యూ విభాగానికి ఆదేశాలు ఇవ్వండి’ అని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదురి లోక్‌సభలో సూచించారు.

ఆధార్‌-పాన్‌ లింకు (Aadhaar-PAN linking) చేసుకునేందుకు మార్చి 31, 2023నాటికి తుది గడువుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఒకవేళ ఇలా అనుసంధానం చేసుకోలేకపోతే పాన్‌ కార్డు పనిచేయదని తెలిపింది. అయితే, ఇలా మార్చి 31, 2022 నాటికి ఉచితంగానే అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనంతరం రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్‌ 1, 2022 వరకు పొడిగించిన ప్రభుత్వం జులై 1, 2022 నుంచి దాన్ని రూ. వెయ్యికి పెంచింది. తాజాగా ఆ గడువు కూడా దగ్గరపడుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని