Aaditya Thackeray: మీకోసం తలుపులు తెరిచే ఉంటాయి.. ఆ నేతలకు ఆదిత్య పిలుపు!

పార్టీని వీడిన నేతల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, రావాలనుకునేవారు రావొచ్చని మాజీ సీఎం తనయుడు ఆదిత్య ఠాక్రే కోరారు........

Published : 24 Jul 2022 01:50 IST

ముంబయి: ఏక్‌నాథ్‌ శిందే వర్గం నేతలు తిరుగుబాటు చేయడంతో మహారాష్ట్రలో ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వందిగిపోయి కొత్త సర్కారు ఏర్పడిన విషయం తెలిసిందే. ఉద్ధవ్‌కు మరో షాక్‌ ఇస్తూ.. ఆయన నేతృత్వంలోని పార్టీకి చెందిన 12 మంది ఎంపీలు విడిపోయి, నూతన ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేకు విధేయులై ఉంటామని ఈనెల 19న  ప్రకటించారు. అయినప్పటికీ ఆ నేతలపై ఉద్ధవ్‌ వర్గం పూర్తిగా విశ్వాసం కోల్పోయినట్లు లేదు. పార్టీని వీడిన నేతల కోసం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, రావాలనుకునేవారు రావొచ్చని మాజీ సీఎం తనయుడు ఆదిత్య ఠాక్రే కోరారు.

ఉద్ధవ్‌ ఠాక్రే, ఏక్‌నాథ్‌ శిందేల మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉందా? అని ఆదిత్యను విలేకర్లు ప్రశ్నించగా.. ‘మాకు ద్రోహం చేసి, వారితో చేరిన వారికి అప్పుడే చెప్పాను. వారు తిరిగి రావాలనుకుంటే తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి శిందే సహా పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆదిత్య థాక్రే ఈ సందర్భంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వం ‘చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం’ అని పేర్కొన్నారు.

కొద్దిరోజుల వ్యవధిలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని సర్కారుపై తిరుగుబాటు ఏక్‌నాథ్‌ శిందే వర్గం తిరుగుబాటు చేయగా.. ఠాక్రే మెజార్టీ కోల్పోయి అధికారం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం భాజపా మద్దతుతో శిందే ముఖ్యమంత్రి అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని