Shraddha Murder: వారు స్పందించి ఉంటే శ్రద్ధా బతికేది.. మీడియా ముందు తండ్రి ఆవేదన

ముంబయి పోలీసులు స్పందించి ఉంటే తన కుమార్తె శ్రద్ధా వాకర్‌ (Shraddha Walkar) ఇప్పుడు బతికి ఉండేదని ఆమె తండ్రి వికాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హత్య గురించి తొలిసారి ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 09 Dec 2022 15:38 IST

ముంబయి: తన కుమార్తెను అతి దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్‌ పూనావాలా (Aaftab Poonawala)ను ఉరితీయాలని శ్రద్ధా వాకర్ (Shraddha Walkar) తండ్రి వికాస్‌ డిమాండ్‌ చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా హత్య (Shraddha Murder) కేసులో దిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు సాగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మృతురాలి తండ్రి వికాస్‌ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మహారాష్ట్ర పోలీసులు సమయానికి స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నా కుమార్తెకు జరిగినట్లు మరెవరికీ జరగకూడదు. ఆఫ్తాబ్‌ గురించి శ్రద్ధా.. వసయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడే వారు స్పందించి దర్యాప్తు చేపట్టి ఉంటే ఆమె బతికేది. మాణిక్‌పూర్‌, వసయి పోలీసుల తీరుతో నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా. అయితే ఇప్పుడు దిల్లీ పోలీసుల దర్యాప్తు సరైన దిశగానే సాగుతోంది. నా కుమార్తె మరణానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ఆఫ్తాబ్‌ నా కుమార్తెను ఎంత దారుణంగా హింసించాడో.. అంతే ఘోరంగా అతడికి శిక్ష పడాలి. ఈ కేసుకు సంబంధమున్న అతడి కుటుంబం, ప్రతి ఒక్కరినీ విచారించాలి. దర్యాప్తు పారదర్శకంగా జరగాలి. ఆఫ్తాబ్‌ను ఉరితీయాలి అని నేను కోరుకుంటున్నా’’ అని వికాస్ (Vikas Walkar) తెలిపారు.

శ్రద్ధాతో చివరగా మాట్లాడింది అప్పుడే..

‘‘శ్రద్ధాతో నేను చివరిసారిగా 2021 మధ్యలో మాట్లాడాను. ఎలా ఉన్నావ్‌.. అని అడిగాను. అదే మా చివరి సంభాషణ. ఆ తర్వాత గతేడాది సెప్టెంబరులో ఆఫ్తాబ్‌కు ఫోన్‌ చేసి నా కుమార్తె గురించి అడిగాను. కానీ, అతడు.. శ్రద్ధా ఎక్కడికి వెళ్లిందో తనకు తెలియదని చెప్పాడు. శ్రద్ధాను మేమంతా ఒంటరిగా వదిలేశామని ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు. కానీ, మేం అలా చేయలేదు. ఆఫ్తాబ్‌ అంతగా వేధించినా ఆమె ఎందుకు తిరిగి ఇంటికి రాలేదో నాకు అర్థం కావట్లేదు. దానికి కారణం తెలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నించా. కానీ శ్రద్ధా ఎప్పుడూ సమాధానం చెప్పలేదు’’ అని వికాస్‌ ఉద్విగ్నభరితులయ్యారు.

ఆఫ్తాబ్, శ్రద్ధా దిల్లీకి రాకముందు ముంబయి శివారులోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం సాగించారు. అప్పటి నుంచే ఆమె ఆఫ్తాబ్‌ వేధింపులను భరిస్తూ వస్తోంది. ఆఫ్తాబ్‌ తనను తీవ్రంగా కొట్టాడని 2020లో శ్రద్ధా ఓసారి వసయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు అప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. అయితే, ఆ ఫిర్యాదుపై తాము విచారించామని స్థానిక పోలీసులు చెబుతున్నారు. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని శ్రద్ధానే ఆ తర్వాత వాంగ్మూలం ఇచ్చిందని పేర్కొన్నారు.

ఆఫ్తాబ్‌ కస్టడీ పొడిగింపు..

మరోవైపు ఈ కేసులో ఆఫ్తాబ్‌ కస్టడీని దిల్లీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. నిందితుడి జ్యుడీషియల్‌ కస్టడీ నేటితో ముగియడంతో అతడిని శుక్రవారం దిల్లీ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపర్చారు. కేసు విచారణ ఇంకా జరుగుతుండటంతో అతడి కస్టడీని పొడగించాలని పోలీసులు కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. ఈ కేసులో ఇప్పటికే అతడికి నార్కో, పాలిగ్రాఫ్‌ పరీక్షలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని