Tihar Jail: సిసోదియాకు జైల్లో ప్రాణహాని: ఆప్‌ నేతల ఆరోపణ

తిహాడ్‌ జైల్లో (Tihar Jail) ఉన్న మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) ప్రాణాల రక్షణపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆయన్ను తీవ్ర నేరచరిత కలిగిన ఖైదీలతో ఉంచారని ఆరోపించింది.

Published : 08 Mar 2023 21:57 IST

దిల్లీ: మద్యం కుంభకోణంలో అరెస్టై తిహాడ్‌ జైల్లో (Tihar Jail) ఉన్న దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) రక్షణపై ఆమ్‌ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. జైల్లో ఆయన్ను తీవ్ర నేరచరిత కలిగిన ఖైదీలుండే విభాగంలో ఉంచారని.. అందుకే ఆయనకు ప్రాణహాని ఉందని ఆరోపించింది. న్యాయస్థానం అనుమతి ఇచ్చినప్పటికీ సిసోదియాకు ధ్యానం చేసుకునేందుకు సెల్‌ను కేటాయించలేదని ఆప్‌ చేసిన ఆరోపణలను జైలు అధికారులు ఖండించారు.

‘జైలులోని విపాసన (ధ్యానం చేసుకునే) సెల్‌లో ఉంచాలని మనీశ్‌ సిసోదియా విజ్ఞప్తి చేశారు. అందుకు న్యాయస్థానం కూడా అనుమతించింది. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ ఇతర నేరస్థులుండే జైలు నంబర్‌ 1లో సిసోదియాను ఉంచారు. ఇలా ఎందుకు చేస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలి’ అని ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ ప్రశ్నించారు.

‘కేంద్ర దర్యాప్తు సంస్థలను భాజపా, కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నాయి. ఆయనపై మోపిన తప్పుడు అభియోగాలపై సంతకం పెట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. ప్రమాదకరమైన నేర చరిత్ర కలిగిన ఖైదీలున్న జైలు నంబర్‌1లో మనీశ్‌ సిసోదియాను ఉంచారు. దీంతో ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది’ అని ఆప్‌ సీనియర్‌ నేత సంజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి నేరస్థులతో పాటు సిసోదియాను ఉంచారని ఆ పార్టీ సీనియర్‌ నేత దిలీప్‌ పాండే ఆరోపించారు.

సిసోదియాకు రక్షణకు సంబంధించి ఆప్‌ నేతలు చేసిన ఆరోపణలను తిహాడ్‌ జైలు అధికారులు తోసిపుచ్చారు. మనీశ్‌ సిసోదియా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆయన్ను జైలు నంబర్‌ 1లో ఉంచామన్నారు. గ్యాంగ్‌స్టర్లు కాని, జైల్లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలే అందులో ఉన్నారని చెప్పారు. ఆయనకు కేటాయించిన ప్రత్యేక సెల్‌లోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా ధ్యానంతో పాటు ఇతర కార్యక్రమాలు చేసుకోవచ్చన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని