Punjab: పంజాబ్‌కు కొత్త ‘పవర్‌’ఫుల్‌ న్యూస్‌.. 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌

పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువుదీరి నేటికి సరిగ్గా నెల రోజులు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఆప్‌ సర్కారు శుభవార్త ప్రకటించింది

Updated : 16 Apr 2022 12:39 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కొలువుదీరి నేటికి సరిగ్గా నెల రోజులు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆప్‌ సర్కారు శుభవార్త ప్రకటించింది. జులై 1 నుంచి ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్‌ 16న రాష్ట్ర ప్రజలు మంచి వార్త వినబోతున్నారంటూ ఇటీవల సీఎం భగవంత్‌ మాన్‌ ప్రకటించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌తో మాన్‌ ఇటీవల సమావేశమై దీనిపై చర్చించారు. 

రాష్ట్రంలోని ప్రతి ఇంటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దేశ రాజధాని దిల్లీలోనూ ఆమ్‌ ఆద్మీ సర్కారు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. పంజాబ్‌లో అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా ఉచిత విద్యుత్‌ను ప్రజలకు అందిస్తామని ఆప్‌ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అన్నట్లుగానే ఉచిత విద్యుత్‌పై నేడు ప్రకటన చేశారు. ఇక, ఎన్నికల్లో మరో ప్రధాన హామీ అయిన డోర్‌స్టెప్‌ రేషన్ డెలివరీ పథకాన్ని సీఎం గత నెల అమల్లోకి తెచ్చారు. 

ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 92 చోట్ల జయకేతనం ఎగురవేసింది. దీంతో మార్చి 16న భగవంత్‌ మాన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని