Gujarat: ‘కిడ్నాప్‌’ కలకలం.. చివరకు నామినేషన్‌ వెనక్కి తీసుకున్న ఆప్‌ అభ్యర్థి..!

సూరత్‌ (తూర్పు) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆప్‌ అభ్యర్థి కంచన్‌ జరివాలా కన్పించట్లేదంటూ ఈ ఉదయం కేజ్రీవాల్‌ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది.

Published : 16 Nov 2022 13:49 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్‌ జరివాలా కిడ్నాప్‌ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి అదృశ్యమైన కంచన్‌.. నేడు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చి తన నామినేషన్‌ ఉపసంహరించుకోవడం గమనార్హం.

సూరత్‌ (తూర్పు) నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్‌ జరివాలా కన్పించట్లేదంటూ ఈ ఉదయం దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. నామినేషన్‌ ఉపసంహరించుకునేలా ఆయనపై భాజపా ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. నామినేషన్‌ పత్రాల పరిశీలన కోసం కంచన్‌ నిన్న మధ్యాహ్నం రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వస్తుండగా కొందరు భాజపా వ్యక్తులు ఆయనను బలవంతంగా తీసుకెళ్లారంటూ దిల్లీ ఉపముఖ్యమంత్రి, ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా ఆరోపించారు. భాజపానే ఆయనను ‘కిడ్నాప్‌’ చేసి ఉంటుందని ఆప్‌ నేతలు మండిపడ్డారు. దీంతో ఇది కాస్తా తీవ్ర దుమారానికి దారితీసింది.

అయితే, కేజ్రీవాల్ ట్వీట్‌ చేసిన కొద్ది గంటలకే కంచన్‌ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి రావడం గమనార్హం. అనంతరం ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఈ క్రమంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద ఒకింత ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆప్‌, భాజపా కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని