National party: జాతీయ పార్టీ హోదాతో ప్రయోజనాలేంటో తెలుసా?
దేశంలో జన్‌లోక్‌పాల్(Jan Lokpal) ఉద్యమంతో ప్రాచుర్యం పొందిన అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో జన్‌లోక్‌పాల్(Jan Lokpal) ఉద్యమంతో ప్రాచుర్యం పొందిన అర్వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఇప్పుడు జాతీయ పార్టీ హోదాను దక్కించుకున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం దేశ రాజధాని నగరం కేంద్రంగా ఆవిర్భవించిన ఆ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడమే కాకుండా తాజాగా జరిగిన గుజరాత్ ఎన్నికల్లో దాదాపు 13శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీ హోదాను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అసలు జాతీయ పార్టీ గుర్తింపు ఎలా లభిస్తుంది? జాతీయ పార్టీ హోదా సాధించాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఆ హోదా వస్తే ఏమైనా అదనపు ప్రయోజనాలు ఉంటాయా? అనే వివరాలను ఓసారి పరిశీలిస్తే..
పార్టీ జాతీయ హోదా కోసం..
కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. ఏదైనా పార్టీకి జాతీయ హోదా దక్కాలంటే.. సాధారణ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో పోలైన ఓట్లలో 6% చొప్పున ఓట్లు పొందాలి. లేదా.. ఏవైనా మూడు వేర్వేరు రాష్ట్రాల నుంచి 11 లోక్‌సభ సీట్లు సాధించాల్సి ఉంటుంది. లేదంటే నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీగా గుర్తింపు అయినా పొందిఉండాలి. ప్రస్తుతం ఆప్.. దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉండగా.. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాలు, 6% ఓట్లు దక్కించుకుంది. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాలు గెలుచుకొని దాదాపు 12శాతానికి పైగా ఓట్లు సాధించడం ద్వారా ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది.
దేశంలో ప్రస్తుతం జాతీయ పార్టీలెన్ని?
దేశంలో ప్రస్తుతం ఎనిమిది జాతీయ పార్టీలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్, భాజపా, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే జాతీయ పార్టీ హోదా ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీచేసి అవసరమైన ఓట్లు, సీట్లు సాధించడం ద్వారా నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) జాతీయ పార్టీ హోదాను పొందింది. ఈ పార్టీకి అంతకముందు మణిపూర్, మేఘాలయా, నాగాలాండ్‌లలో గుర్తింపు ఉండగా.. 2019లో అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ రాష్ట్ర పార్టీగా గుర్తింపు సాధించడం ద్వారా 2019 జూన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్‌పీపీకి జాతీయ హోదాను కల్పించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు జాతీయ పార్టీల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇక తాజగా ఈ జాబితాలో తొమ్మిదో పార్టీగా ఆప్ అర్హత సాధించింది.
రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే..
ఒక రాజకీయ పార్టీ ఈ కింది షరతుల్లో ఏదో ఒకదాన్ని నెరవేర్చినట్లయితే.. రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా పరిగణిస్తారు.
- సాధారణ ఎన్నికలు లేదా శాసనసభ ఎన్నికల్లో అసెంబ్లీలో 3శాతం సీట్లు గెలుచుకోవాలి.
- సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు 1 లోక్‌సభ సీటైనా గెలుచుకోవాలి.
- లోక్‌సభ లేదా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కనీసం 6శాతం ఓట్లు సాధించాలి. అదనంగా ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ సీట్లు గెలుచుకోవాలి.
- లోక్‌సభ లేదా శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 8శాతం ఓట్లు సాధించాలి. ఈ నిబంధనలలో ఏ ఒక్క దాన్ని సాధించినా రాష్ట్ర పార్టీగా గుర్తింపు కల్పిస్తారు.
ప్రతి జాతీయ, రాష్ట్ర పార్టీ మళ్లీ ఎన్నికల నాటికి ఆయా షరతుల్ని నెరవేర్చాల్సిందే.. లేదంటే తమ హోదాను కోల్పోతాయి.
జాతీయ పార్టీ హోదాతో ప్రయోజనాలివే..
- దేశవ్యాప్తంగా ఆ పార్టీ ఒకే గుర్తుపై పోటీ చేసే అవకాశం వస్తుంది.
- సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారాలకు అవకాశం లభిస్తుంది.
- ఎన్నికల సమయంలో రాష్ట్ర పార్టీలకు 20మంది స్టార్ క్యాంపెయినర్లకు అవకాశం ఉంటే.. జాతీయ పార్టీలకు మాత్రం గరిష్ఠంగా 40మంది దాకా పెట్టుకోవచ్చు. వారి ప్రయాణ ఖర్చులు అభ్యర్థుల ఖర్చు కింద పరిగణించరు.
- తమ పార్టీ ప్రధాన కార్యాలయాలు నిర్మాణానికి ప్రభుత్వ భూమిని పొందొచ్చు.
- అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రతిపాదించేవారు ఒకరు ఉంటే సరిపోతుంది.
- జాబితా సవరణ సమయంలో రెండు ఓటరు జాబితా సెట్లు ఉచితంగా పొందుతారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జాతీయ పార్టీ అభ్యర్థులు ఒక కాపీని ఉచితంగా పొందే వీలుంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ
-
General News
TelangaNews: ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలపై టీఎస్ఎల్పీఆర్బీ కీలక నిర్ణయం