Gujarat: నామినేషన్‌ తర్వాత ఆప్‌ అభ్యర్థి ‘కిడ్నాప్‌’.. కేజ్రీవాల్‌ ట్వీట్‌

గుజరాత్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి అదృశ్యమయ్యారు. దీని వెనుక భాజపా హస్తం ఉందని ఆప్‌ ఆరోపిస్తోంది.

Published : 16 Nov 2022 12:16 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ.. పోటీలో ఉన్న ఓ అభ్యర్థి అదృశ్యమవడం కలకలం రేపుతోంది. సూరత్‌ (తూర్పు) నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి కంచన్‌ జరివాలా మంగళవారం మధ్యాహ్నం నుంచి కన్పించట్లేదంటూ పార్టీ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ట్విటర్‌లో వెల్లడించారు. ఆయన కిడ్నాప్‌ అయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేశారు.

‘‘సూరత్‌ (తూర్పు) నుంచి పోటీ చేస్తున్న మా అభ్యర్థి కంచన్‌ జరివాలా, ఆయన కుటుంబం నిన్నటి నుంచి అదృశ్యమైంది. ముందు.. కంచన్‌ నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యేలా భాజపా ప్రయత్నాలు చేసింది. కానీ, అధికారులు ఆయన నామినేషన్‌ను ఆమోదించారు. ఆ తర్వాత, నామినేషన్ ఉపసంహరించుకోవాలని కంచన్‌పై ఒత్తిడి వచ్చింది. ఆయనను ఎవరైనా కిడ్నాప్‌ చేసి ఉంటారా?’’ అని కేజ్రీవాల్‌ ఈ ఉదయం ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ రాఘవ్‌ చద్దా మీడియాతో మాట్లాడుతూ భాజపాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కంచన్‌ను భాజపానే కిడ్నాప్‌ చేసి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లిందని ఆరోపించారు. నామినేషన్‌ ఉపసంహరించుకునేలా ఆయనపై కాషాయ పార్టీ ఒత్తిడి తెస్తోందని మండిపడ్డారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా మాట్లాడుతూ.. ‘‘మంగళవారం మధ్యాహ్నం నామినేషన్‌ పత్రాల పరిశీలన కోసం కంచన్‌ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి బయటకు వస్తున్నప్పుడు కొందరు ఆయనను బలవంతంగా అపహరించి.. రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఇది చాలా ప్రమాదకరం. ఇది కేవలం ఓ అభ్యర్థిని కిడ్నాప్‌ చేయడం మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యాన్ని అపహరించడమే’’ అని కాషాయ పార్టీపై విరుచుకుపడ్డారు. అటు ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ స్పందిస్తూ.. ‘‘ఆప్‌ను చూసి భాజపా భయపడుతోంది. అందుకే ఇలాంటి గూండాగిరీకి పాల్పడుతోంది’’ అని దుయ్యబట్టారు. 

అయితే, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతల ఆరోపణలను భాజపా తీవ్రంగా ఖండించింది. ఆప్‌ ఉద్దేశపూర్వకంగానే తమపై నిరాధారణ ఆరోపణలు చేస్తోందని భాజపా నేతలు మండిపడ్డారు. ముందు ఆ అభ్యర్థి గురించి వాళ్లు ఫిర్యాదు చేయాలని, ఆ తర్వాత దర్యాప్తులో నిజానిజాలు బయటికొస్తాయని అన్నారు. ఈ ‘కిడ్నాప్‌’ వ్యవహారంపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆప్‌ తెలిపింది. సూరత్ (తూర్పు) నియోజకవర్గం నుంచి భాజపా తరఫున అరవింద్ భాయ్‌ రాణా పోటీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని