Arvind Kejriwal: సిసోదియాపై దాడులు.. గుజరాత్‌లో ఆప్‌ ఓటు షేర్‌ పెరిగింది..!

దేశ రాజధాని దిల్లీలో భాజపా - ఆప్‌ మధ్య రాజకీయ విభేదాలు ముదిరిన వేళ సొంత ప్రభుత్వంపై తీసుకొచ్చిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి

Published : 01 Sep 2022 16:02 IST

భాజపాకు అరవింద్‌ కేజ్రీవాల్‌ కౌంటర్‌

విశ్వాస పరీక్షలో నెగ్గిన దిల్లీ ముఖ్యమంత్రి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భాజపా - ఆప్‌ మధ్య రాజకీయ విభేదాలు ముదిరిన వేళ సొంత ప్రభుత్వంపై తీసుకొచ్చిన విశ్వాస పరీక్షలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నెగ్గారు. ఆప్‌ ఎమ్మెల్యేలంతా సీఎంకు అనుకూలంగా ఓటేశారు. దీంతో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ భాజపాపై విమర్శల వర్షం కురిపించారు. దిల్లీలో ఆపరేషన్‌ కమల్‌ విఫలమైందని రుజువైందని అన్నారు. సీబీఐ దాడులతో కేంద్రం తమను భయపెట్టాలని చూసిందని, కానీ అది వారికే హాని చేసిందన్నారు. ఈ సోదాలతో గుజరాత్‌లో తమ ఓటు షేరు పెరిగిందన్నారు.

ప్రభుత్వాలను కూలదోసేందుకు భాజపా చేపట్టిన ‘ఆపరేషన్‌ కమలం’ దిల్లీలో విఫలమైందని రుజువు చేసేందుకు ఆగస్టు 29న కేజ్రీవాల్‌ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై నేడు ఓటింగ్‌ చేపట్టగా.. ఆప్‌ సర్కారు విజయం సాధించింది. 70 మంది శాసనసభ్యులున్న దిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62, భాజపాకు 8 మంది ఎమ్మెల్యే సంఖ్యా బలం ఉంది. ఇందులో ఇద్దరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండగా.. మరో శాసనసభ్యుడు సత్యేంద్ర జైన్‌ జైల్లో ఉన్నారు. మిగిలిన 59 మందిలో ఒకరు స్పీకర్‌గా ఉన్నారు. విశ్వాస తీర్మానంపై గురువారం మూజువాణీ, డివిజన్‌ పద్ధతిలో ఓటింగ్‌ చేపట్టారు. కేజ్రీవాల్‌కు అనుకూలంగా 58 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. భాజపా ఎమ్మెల్యేలెవరూ సభలో లేకపోవడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటూ పడలేదు. అసెంబ్లీలో ఆందోళనకు దిగినందుకు గానూ ముగ్గరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను స్పీకర్‌ మార్షల్స్‌తో బలవంతంగా బయటకు పంపించారు. ఈ ఘటనను నిరసిస్తూ మిగతా ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు.

4 శాతం పెరిగిన ఓటు షేరు..

విశ్వాస పరీక్ష అనంతరం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ భాజపాపై ఆరోపణలు గుప్పించారు. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాపై సీబీఐ దాడుల తర్వాత గుజరాత్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటు షేరు 4శాతం పెరిగిందన్నారు. సిసోదియాను అరెస్టు చేసిన తర్వాత ఓటు షేరు మరో 6శాతం పెరుగుతుందన్నారు. సీబీఐ దాడుల్లో సిసోదియా వద్ద ఏమీ దొరకలేదని, ప్రధాని మోదీ తమ నిజాయతీకి ఇచ్చిన సర్టిఫికేట్‌ ఇదేనని అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భాజపా రూ.20 కోట్ల నుంచి రూ.50కోట్ల వరకు ఆఫర్‌ చేసిందని.. అయితే వారి ఆఫర్‌ను ఒక్క ఆప్‌ ఎమ్మెల్యే కూడా స్వీకరించలేదని ఎద్దేవా చేశారు. ‘‘స్కూళ్లు, ఆసుపత్రులు కట్టించి నేనేమైనా తప్పు చేస్తున్నానా? మా పిల్లలిద్దరూ ఐఐటీల్లోనే చదివారు. అలాంటి విద్యనే దేశంలోని ప్రతి చిన్నారికి అందించాలనుకుంటున్నా’’ అని కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని