Corona: హోం టెస్టింగ్‌ కిట్‌ విడుదల.. ధర ఎంతంటే?

కరోనా వైరస్‌ రోజుకో వేరియంట్‌ రూపంలో విరుచుకుపడుతుండటంతో చిన్న తుమ్ము, దగ్గువచ్చినా కలవరపడటం సహజంగా మారిపోయింది. పరీక్షలు చేయించుకుందామని ఆస్పత్రులకు వెళ్లాలన్నా అక్కడికి వెళ్లి ......

Updated : 12 Jul 2021 16:56 IST

దిల్లీ: కరోనా వైరస్‌ రోజుకో వేరియంట్‌ రూపంలో విరుచుకుపడుతుండటంతో చిన్న తుమ్ము, దగ్గు వచ్చినా కలవరపడటం సహజమైపోయింది. పరీక్షలు చేయించుకుందామని ఆస్పత్రులకు వెళ్లాలన్నా అక్కడికి వెళ్లి లేని రోగం అంటించుకుంటామేమోననే అనుమానం మరోవైపు వెంటాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో మనకు మనమే కొవిడ్‌ పరీక్షలు చేసుకునేలా అబ్బోట్‌ లైఫ్‌కేర్‌ సంస్థ కొవిడ్‌-19 హోమ్‌ టెస్ట్‌ కిట్‌ను ఆవిష్కరించింది. పెద్దలు, చిన్నారుల్లో కొవిడ్‌ లక్షణాలు ఉన్నాయో, లేదో సులభంగా కచ్చితమైన ఫలితాన్ని ఈ కిట్‌తో తెలుసుకోవచ్చని ఆ సంస్థ వెల్లడించింది. పాన్‌బయో కొవిడ్‌ ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్‌ ధరను రూ.325గా నిర్ణయించినట్టు తెలిపింది. ఈ కిట్‌ల ద్వారా దేశంలోని ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందని పేర్కొంది. 

కచ్చితమైన ఫలితాన్ని సులభమైన పద్ధతుల్లో వేగంగా తెలుసుకొనే ఇలాంటి పరికరాల ద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చని ఐసీఎంఆర్‌ మాజీ డీజీ నిర్మల్‌ కుమార్‌ గంగూలీ అన్నారు. ఇంట్లోనే స్వీయ పరీక్ష చేయించుకోవడం ద్వారా ముందుగానే వైరస్‌ను పసిగట్టి కట్టడి చేయవచ్చన్నారు. కరోనాపై పోరాటంలో ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలే చాలా కీలకమని, ఈ మహమ్మారి క్లిష్ట దశలో తమ సంస్థ పలు రకాల చికిత్స అవకాశాలను అందజేసిందని అబ్బోట్ ర్యాపిడ్‌ డయాగ్నోస్టిక్స్‌ ఆసియా పసిఫిక్‌ డివిజనల్‌ ఉపాధ్యక్షుడు సంజీవ్‌ జోహార్‌ అన్నారు.  జులై చివరి కల్లా తొలి దశలో 7మిలియన్‌ టెస్ట్‌ కిట్లను పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. 

మరోవైపు, దేశ అవసరాలకు తగినన్ని టెస్టింగ్‌ కిట్లను అందుబాటులో ఉంచుతామని  అబ్బోట్‌ సంస్థ తెలిపింది. అబ్బోట్‌ పాన్‌బయో కొవిడ్‌- 19 యాంటీజెన్‌ కిట్‌ ఒక కిట్‌ ధర రూ.325లు కాగా.. నాలుగు కిట్‌లతో ఉన్న ప్యాక్‌ ధర రూ.1250, 10 కిట్‌లతో కూడిన ప్యాక్‌ ధర రూ.2800, 20 కిట్‌లతో కూడిన ప్యాక్‌ను రూ.5400లకు అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా పట్టణ/గ్రామీణ ప్రాంతాల్లో ఈ కిట్‌లు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా పంపిణీ చేయనున్నట్టు స్పష్టం చేసింది. దేశంలో కిట్‌ల లభ్యతను పెంచడంతో పాటు 80శాతం కన్నా ఎక్కువ మందికి చేరుకోవడమే తమ లక్ష్యమని ‘అబ్బోట్‌’ పేర్కొంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని