Missing Arunachal boy: ‘నా కుమారుడ్ని చైనా చిత్రహింసలు పెట్టింది’

తమ కుమారుడిని చైనా చిత్ర హింసలు పెట్టినట్లు అరుణాచల్‌లో అదృశ్యమైన యువకుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.......

Published : 02 Feb 2022 01:14 IST

ఇంటికి చేరిన మిరామ్‌ తరోన్‌ పరిస్థితిపై తండ్రి ఆవేదన

ఇటానగర్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన యువకుడు మిరామ్‌ తరోన్‌ (17) సరిహద్దుల వద్ద ‘అదృశ్యమై’ తిరిగి భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తమ కుమారుడిని చైనా చిత్ర హింసలు పెట్టినట్లు ఆ యువకుడి తండ్రి ఆరోపించారు. అతడికి కరెంట్‌ షాక్‌ ఇచ్చారని, ఆ దేశ అధీనంలో ఉన్నన్ని రోజులూ కళ్లకు గంతలు కట్టి, చేతులను తాళ్లతో కట్టేసి ఉంచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నట్లు వాపోయారు.

అప్పర్‌ సియాంగ్‌ జిల్లా జిడో గ్రామానికి చెందిన మిరామ్‌ తరోన్‌ గత నెల 18న కనిపించకుండా పోయాడు. చైనా పీఎల్‌ఏ బలగాలు అపహరించినట్లు అరుణాచల్‌ తూర్పు ఎంపీ తాపిర్‌ గావ్‌ తొలుత వెల్లడించారు. మిరామ్‌ వెంటే ఉన్న అతడి స్నేహితుడు జానీ యాయింగ్‌ చైనా సైనికుల నుంచి తప్పించుకోగలిగాడని ఆయన ట్వీట్‌ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆర్మీ వర్గాలు మాత్రం ఈ ఘటనను ‘అదృశ్యం’గా పేర్కొన్నాయి.

ఈ అంశంపై భారత ఆర్మీ.. హాట్‌లైన్‌ ద్వారా చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)తో సంప్రదింపులు జరిపింది. దీంతో తమ భూభాగంలో ఓ బాలుడిని గుర్తించినట్లు వెల్లడించిన చైనా బలగాలు.. పలు ఆధారాల ద్వారా ఆ యువకుడు మిరామ్‌ తరోన్‌ అని ధ్రువీకరించాయి. రక్షణ శాఖతో పలు సంప్రదింపుల అనంతరం జనవరి 27న భారత సైన్యానికి తరోమ్‌ను చైనా అప్పగించింది.

పలు వైద్య పరీక్షలు, క్వారంటైన్‌ అనంతరం భారత సైన్యం ఆ యువకుడిని ఈరోజు కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. ఈ విషయాన్ని అప్పర్‌ సియాంగ్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ వెల్లడించారు. ఇంటికి చేరిన తరోన్‌కు స్థానిక పాలకవర్గం, పంచాయతీ నాయకులు ఘనస్వాగతం పలికినట్లు తెలిపారు. ఎంపీ తాపిర్‌ గావ్‌ సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

మిరామ్ పరిస్థితిపై తండ్రి ఒపాంగ్ తరోన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనతో తన కొడుకు మానసికంగా కుంగిపోయాడని వాపోయారు. ఈ ఘటన తనను ఎంతో భయపెట్టిందన్నారు. ‘నా కుమారుడు ఇంకా షాక్‌లోనే ఉన్నాడు. వీపు భాగంలో కొట్టారు. ఎలక్ట్రిక్‌ షాకిచ్చారు. పీఎల్‌ఏ అదుపులో ఉన్నన్ని రోజులూ అత్యధిక శాతం అతడి కళ్లకు గంతలు కట్టే ఉంచారు. చేతులను తాళ్లతో కట్టేశారు. తినే సమయంలో మాత్రమే ఆ కట్లను విప్పారు’ అని వాపోయారు. కానీ తగినంత ఆహారం అందించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు