Supreme Court: ‘విద్వేష ప్రసంగాలపై.. ఏం చర్యలు తీసుకున్నారు?’

దేశంలో మత సామరస్యాన్ని కాపాడుకునేందుకు విద్వేష ప్రసంగాలను నిర్మూలించడం అవసరమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. కేవలం ఎఫ్‌ఐఆర్‌ల నమోదుతో సమస్య పరిష్కారం కాదని.. వాటి విషయంలో ఏ చర్యలు తీసుకున్నారని సొలిసిటర్ జనరల్‌ను ప్రశ్నించింది.

Published : 28 Mar 2023 18:45 IST

దిల్లీ: విద్వేష ప్రసంగాల (Hate Speech)పై సుప్రీం కోర్టు (Supreme Court) మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో మత సామరస్యాన్ని (Communal Harmony) కాపాడుకునేందుకు విద్వేషపూరిత ప్రసంగాలను కట్టడి చేయడం అవసరమని పేర్కొంది. విద్వేష ప్రసంగాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

విద్వేష ప్రసంగాలకు సంబంధించి 18 కేసులు నమోదు చేసినట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, కేవలం కేసుల నమోదుతో ఈ సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని సొలిసిటర్ జనరల్‌ మెహతాను ప్రశ్నించింది. తదుపరి విచారణ నిమిత్తం కేసును బుధవారానికి వాయిదా వేసింది.

విద్వేష ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని సర్వోన్నత న్యాయస్థానం గతంలోనూ పేర్కొంది. ఫిర్యాదు కోసం ఎదురుచూడకుండా సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎంతో తీవ్రమైన ఈ సమస్యపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం ఏదైనా జాప్యం చేస్తే.. కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని కూడా హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని