Delta Plus Variant: పండుగల్లో జాగ్రత్త.. ఇప్పటివరకు నమోదైన డెల్టా ప్లస్‌ కేసులెన్నంటే?

భారత్‌ సహా ప్రపంచదేశాలను ఇంకా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వీక్లీ పాజిటివిటీ రేటు ట్రెండ్‌ మన దేశంలో తగ్గినట్టు కనబడుతున్నప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా తొలగిపోలేదని.....

Published : 02 Sep 2021 19:51 IST

వివరాలు వెల్లడించిన కేంద్రం

దిల్లీ: దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 300 డెల్టా ప్లస్ వేరియంట్‌ కేసులు నమోదైనట్టు కేంద్రం వెల్లడించింది. భారత్‌ సహా ప్రపంచదేశాలను ఇంకా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వీక్లీ పాజిటివిటీ రేటు ట్రెండ్‌ మన దేశంలో తగ్గినట్టు కనబడుతున్నప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ ఇంకా తొలగిపోలేదని తెలిపింది. దేశంలో కరోనా వైరస్‌ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 31 నాటికి దేశంలో 39 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కన్నా అధికంగా ఉందని  పేర్కొన్నారు. మరో 38 జిల్లాల్లో మాత్రం ఈ రేటు 5 నుంచి 10 శాతంగా ఉన్నట్టు చెప్పారు. థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల నేపథ్యంలో రాబోయే పండుగల సీజన్‌లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జనం భారీగా గుమిగూడొద్దని, ఒకవేళ తప్పనిసరైతే పూర్తిగా వ్యాక్సినేషన్‌ అయ్యేలా చూసుకోవాలని కోరారు. ప్రజలంతా ఇళ్లలోనే పండుగలు జరుపుకోవాలని, వ్యాక్సిన్‌ తీసుకోవడంతో పాటు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 

దేశంలో ప్రస్తుతం ఉన్న మూడున్నర లక్షలకు పైగా ఉన్న క్రియాశీల కేసుల్లో 2,30,461 (59.16శాతం) కేసులు ఒక్క కేరళలోనే ఉన్నాయన్నారు. 54,606 కేసులు (14.02 శాతం) మహారాష్ట్రలో, 18,438 కేసులు (4.73శాతం) కర్ణాటక, 16,620 కేసులు (4.27శాతం) తమిళనాడు, 14,473 కేసులు (3.71శాతం) ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు వివరించారు. యాక్టివ్‌ కేసులు లక్ష కన్నా అధికంగా ఒక రాష్ట్రంలో ఉండగా.. 10 వేలు నుంచి లక్ష వరకు నాలుగు రాష్ట్రాల్లో, 10వేల కన్నా తక్కువ కేసులు 31 రాష్ట్రాల్లో ఉన్నట్టు తెలిపారు.

దేశంలో సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలో రాబోయే వినాయక చవితి, దీపావళి, ఈద్‌ వంటి పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని, బయట గుంపులు గుంపులుగా గూమిగూడద్దని అధికారులు కోరారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌ మాట్లాడుతూ..‘‘ గతేడాది కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ.. పండుగలను ఎలాగైతే జరుపుకొన్నామో.. ఈఏడాదీ అదే పద్ధతిని కఠినంగా అమలుచేయాలి. జనసంచార ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం తప్పనిసరి’’ అని అన్నారు. ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారత్‌లో సెకెండ్‌ వేవ్‌ కొనసాగుతోందని, అందుకే ప్రజలు తమ ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల్ని తూ.చ.తప్పకుండా అమలు చేయాలని సూచించారు. పండుగ సీజన్‌ సమీపించడంతో పాటు పాఠశాలలు పునఃప్రారంభం కావడం,  కేరళలో పెరుగుతున్న కేసులు.. ఇలా మొత్తంగా కలుపుకొని గత రెండు నెలలుగా నమోదుకానంత స్థాయిలో గురువారం ఒక్కరోజే 47వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం గమనార్హం.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts