NEET row: పరీక్షల పవిత్రతను కాపాడాలి: విద్యావేత్తల విజ్ఞప్తి

దేశంలో పరీక్షల సమగ్రతను కాపాడాలని పలువురు విద్యావేత్తలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Published : 23 Jun 2024 21:59 IST

దిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే వార్తలతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో పరీక్షల విశ్వసనీయతను కాపాడాలని పలువురు విద్యావేత్తలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లక్షల మంది విద్యార్థులతో ముడిపడివున్న అంశం కావడంతో ఈ వ్యవహారంలో అవకతవకలపై సమగ్ర విచారణ అవసరమని.. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సత్వర పరిష్కారాలు సాధ్యం కావన్నారు.

ఎన్‌టీఏ డీజీ సుబోధ్‌ సింగ్‌ను తొలగించడంతోపాటు నీట్‌ అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం విద్యార్థుల్లో విశ్వాసం నింపుతుందని విద్యావేత్తలు పేర్కొన్నారు. ‘‘ఎన్‌టీఏ ప్రక్షాళనపై కేంద్రం ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. నివేదిక వచ్చేవరకు వేచిచూడాలి. ఓపిక అవసరం’ అని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ -బెంగళూరు’ డైరెక్టర్ గోవింద రంగరాజన్‌ పేర్కొన్నారు.

ఎన్‌టీఏ కేసులన్నీ సీబీఐ అప్పగించాలనే నిర్ణయం విద్యార్థుల్లో విశ్వాసం నింపుతుందని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ ఫోరమ్‌ ఛైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధే అభిప్రాయపడ్డారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు వంటివి దిద్దుబాటు చర్యలు సకాలంలో తీసుకున్నారన్నారు. నీట్‌ పరీక్ష రాసిన 24లక్షల మందికి మళ్లీ పరీక్ష ఉండకూడదని మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ ఛైర్మన్‌ మోహన్‌దాస్‌ పాయ్‌ పేర్కొన్నారు. కేవలం తప్పిదం జరిగిన సెంటర్లలోనే పరీక్ష నిర్వహించాలని అన్నారు. పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

నీట్‌ పరీక్షల్లో ‘మున్నాభాయ్‌’లు.. వెలుగులోకి కళ్లుబైర్లుకమ్మే వాస్తవాలు..!

పరీక్షల సంస్కరణలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడాన్ని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌ కుమార్‌ స్వాగతించారు. పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను మెరుగుపరచడం, ఎన్‌టీఏ నిర్మాణం, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పులు, విద్యార్థుల ప్రయోజనాలు, వారి భవిష్యత్తు తొలి ప్రాధాన్యమని అన్నారు.

నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీతో ముసురుకున్న వివాదాల నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ(NTA) డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌కు ఉద్వాసన పలికడంతోపాటు నీట్‌ యూజీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించింది. దీంతోపాటు ముందు జాగ్రత్త చర్యగా నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేసింది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో ఎన్‌టీఏ సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని