Active cases:11 రాష్ట్రాలు.. 25లక్షలు! 

భారత్‌లో కరోనా పెను ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి రోజురోజుకీ మరింత ఉద్ధృతరూపం దాల్చుతోంది.....

Published : 02 May 2021 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా పెను ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి రోజురోజుకీ మరింత ఉద్ధృతరూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా అనేకచోట్ల కఠిన ఆంక్షలు అమలులో ఉన్నా.. టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నా వైరస్‌ వాయువేగంతో వ్యాపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం 4లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో క్రియాశీల కేసుల గ్రాఫ్‌ భారీగా పెరిగిపోతోంది.  కేంద్ర ఆరోగ్యశాఖ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం.. దేశ వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 19.45లక్షల శాంపిల్స్‌ పరీక్షించగా.. 4,01,993 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే, 2,99,988 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. 3523 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 32.68 లక్షలకు పెరిగిపోయింది. వీటిలో దాదాపు 25.5లక్షలకు పైగా (78.22% కేసులు) కేవలం 11 రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.

ఆ రాష్ట్రాలివే..
మహారాష్ట్రలో 6.64లక్షల క్రియాశీల కేసులు ఉండగా.. ఆ తర్వాత కర్ణాటక, యూపీ, కేరళలో ఒక్కోచోట 3లక్షలకు పైగా ఉన్నాయి. అలాగే, రాజస్థాన్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, బిహార్‌లలో ఒక్కో రాష్ట్రంలో లక్ష పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

సెకండ్‌ వేవ్‌లో మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 3523 మరణాలు నమోదవ్వగా.. వీటిలో 76.75శాతం మరణాలు కేవలం పది రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో అత్యధికంగా 828మంది ప్రాణాలు కోల్పోగా.. దిల్లీలో 375, యూపీ 332, ఛత్తీస్‌గఢ్‌ 269, కర్ణాటక 217, గుజరాత్‌ 173, రాజస్థాన్‌ 155, ఉత్తరాఖండ్‌ 122, జార్ఖండ్‌ 120, తమిళనాడు 113 చొప్పున కొత్తగా మరణాలు నమోదయ్యాయి. నాలుగు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని