India Corona: మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. లక్షకు పైగా కరోనా బాధితులు..!

దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరుగుతున్నాయి.

Published : 30 Jun 2022 10:12 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు తగ్గినట్టే తగ్గి.. ఒక్కసారిగా పెరుగుతున్నాయి. క్రితం రోజు 14 వేలుగా ఉన్న కేసులు.. తాజాగా 18 వేలు దాటాయి. దాంతో క్రియాశీల కేసులు(Active Cases) లక్ష పైకి చేరాయి. నేడు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

బుధవారం 4.52 లక్షల మందికి కొవిడ్(Covid-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,819 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితంరోజు కంటే కొత్త కేసులు 4 వేల మేర అధికంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.16 శాతానికి చేరి ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ కేసులు ఈ స్థాయిలో ఉండటం 130 రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడే కావడం గమనార్హం. మొత్తం కేసుల్లో ఒక్క కేరళ(4,459), మహారాష్ట్ర(3,957)ల్లోనే 8 వేలకుపైగా కేసులు రాగా.. కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, దిల్లీలో వెయ్యిమందికి పైగా కరోనా బారినపడ్డారు. 

తాజా ఉద్ధృతితో క్రియాశీల కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య లక్ష దాటి..1,04,555కి చేరింది. యాక్టివ్‌ కేసుల రేటు 0.24 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.55 శాతానికి పడిపోయింది. నిన్న 13,827 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య కాస్త ఎక్కువగానే కనిపించింది. 24 గంటల వ్యవధిలో 39 మంది మరణించగా.. అందులో 17 మరణాలు కేరళలో నమోదైనవే. 

ఈ వైరస్ కట్టడికి గత ఏడాది ప్రారంభం నుంచి కేంద్రం నిర్వహిస్తోన్న టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 197.61 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 14.17 లక్షల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని