Darshan Case: కరెంటు షాక్‌ ఇచ్చి.. దర్శన్‌ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు!

కన్నడ నటుడు దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్యకు ముందు.. అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

Updated : 18 Jun 2024 14:00 IST

బెంగళూరు: కర్ణాటకలోని నటుడు దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అతడిని చిత్ర హింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో అతడికి కరెంటు షాక్‌ ఇచ్చినట్లు తేలింది. ఇటీవల అరెస్టు చేసిన కేబుల్‌ వర్కర్‌ ధన్‌రాజ్‌ను విచారించగా ఈ విషయాలు బయటకు వచ్చాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.

దర్శన్‌పై నమోదైన హత్య కేసులో నిందితులను విచారిస్తున్న పోలీసులు.. మాండ్యాకు చెందిన ధన్‌రాజ్‌ అనే ఓ కేబుల్‌ వర్కర్‌ను ఇటీవల అరెస్టు చేశారు. నందీశ్‌ అనే వ్యక్తి తనను బెంగళూరులోని ఓ గోడౌన్‌కు తీసుకెళ్లాడని చెప్పాడు. అక్కడే రేణుకాస్వామికి ఎలక్ట్రికల్‌ మెగ్గర్‌తో కరెంటు షాక్‌ ఇచ్చేందుకు ఏర్పాటుచేశామన్నారు. దీంతో ఆ పరికరాన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, పట్టణగెరెలోని షెడ్డులోనే బాధితుడిపై చిత్రహింసలు పెట్టారని పోలీసులు గుర్తించారు. తాను శాకాహారినని చెప్పినా, బలవంతంగా బిర్యానీ, ఎముకను నోట్లో పెట్టి తినిపించారని తెలిసింది. అనంతరం అతడిపై పవిత్రా గౌడ, దర్శన్‌తోపాటు ఇతరులు దాడి చేసినట్లు సమాచారం. మొత్తంగా బాధితుడి శరీరంపై 39 గాయాలుండగా.. వీటిలో ఏడు, ఎనిమిదిచోట్ల కాలిన గాయాలున్నాయని పోలీసులు గుర్తించారు.

మొదట దాడి పవిత్రే!

రేణుకాస్వామిపై మొదట పవిత్రాగౌడ దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తనను కొట్టవద్దని, మరోసారి ఈ తప్పు చేయనని ఆమె కాళ్లపై పడి వేడుకొన్నా.. ఆమె కొట్టిందని నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. పవిత్రా, దర్శన్‌తోపాటు ఇతర నిందితులు వాడిన పలు వస్తువులతోపాటు దుస్తులనూ స్వాధీనం చేసుకున్నారు. దుస్తులపై ఉన్న రక్తం మరకలను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపించారు. మరోవైపు హత్య అనంతరం రేణుకాస్వామి ఒంటిపై ఆభరణాలను నిందితులు దోచుకున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన సమయంలో పవిత్ర మేనేజర్‌ దేవరాజ్‌ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నాడని తేలడంతో.. అతడిని కూడా పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు