Siddharth: డియర్‌ సైనా.. క్షమించు.. నువ్వెప్పటికీ మా ఛాంపియన్‌వే: సిద్ధార్థ్‌

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో నటుడు సిద్ధార్థ్‌ నేడు క్షమాపణలు తెలిపారు. తాను

Updated : 12 Jan 2022 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో నటుడు సిద్ధార్థ్‌ నేడు క్షమాపణలు తెలిపారు. తాను కేవలం జోక్‌ చేయాలనే ఉద్దేశంతోనే ఆ ట్వీట్‌ చేశానని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలు చాలా మందిని బాధించేలా ఉన్నందున తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. సైనా ఎప్పటికీ మన ఛాంపియనే అంటూ ఆమెకు ఓ లేఖ రాశారు. ఆ లేఖను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 

‘‘డియర్‌ సైనా.. కొన్ని రోజుల క్రితం మీ ట్వీట్‌కు స్పందిస్తూ నేను మర్యాద మరిచి చేసిన జోక్‌కు గానూ మీకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నా. చాలా విషయాల్లో మిమ్మల్ని నేను విభేదించొచ్చు. కానీ, మీ ట్వీట్‌ చదివినప్పుడు నిరాశ, కోపంతో చేసిన ఆ కామెంట్లు సమర్థనీయం కావు. మనం జోక్‌ చేసినప్పుడు దానికి వివరణ ఇవ్వాల్సి వస్తే అది నిజంగా మంచి జోక్‌ కాదు. అలాంటి జోక్‌కు నేను క్షమాపణ చెబుతున్నా. అయితే చాలా మంది ఆపాదిస్తున్నట్లుగా నా పదజాలం, హాస్యం వెనుక ఎవరినీ అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. మహిళగా మిమ్మల్ని కించపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. ఇవన్నీ ఇక్కడితో పక్కనబెట్టి నా క్షమాపణ లేఖను అంగీకరిస్తారని ఆశిస్తున్నా. మీరు ఎప్పటికీ మా ఛాంపియనే’’ అని సిద్ధార్థ్ లేఖలో రాసుకొచ్చారు. 

సైనా నెహ్వాల్‌ చేసిన ఓ ట్వీట్‌కు స్పందిస్తూ సిద్ధార్థ్‌ అభ్యంతరకరంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రధాని పంజాబ్‌ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనను ప్రస్తావిస్తూ సైనా ఈ నెల 5న ట్వీట్‌ చేశారు. ‘‘ఒక దేశ ప్రధానికే భద్రత లేకపోతే, ఇక ఆ దేశం భద్రంగా ఉందని ఎలా భావించగలం? ప్రధాని మోదీపై అరాచకవాదుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని ఆమె ట్వీట్‌ చేశారు. దీన్ని ఈనెల 6న సిద్ధార్థ్‌ రీట్వీట్‌ చేస్తూ.. ‘‘చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ ఛాంపియన్‌..! దేవుడా ధన్యవాదాలు.. భారత్‌ను కాపాడడానికి కొందరు రక్షకులున్నారు’’ అని వ్యంగ్యం ధ్వనించేలా ట్వీట్‌ చేశారు. దీంతో ఈ నటుడిపై విమర్శలు వెల్లువెత్తాయి. సిద్ధార్థ్‌ వాడిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ)తో పాటు పలువురు ప్రముఖులు, నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.   సిద్ధార్థ్‌ ఖాతాను బ్లాక్‌ చేయాలని ట్విటర్‌కు, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మహారాష్ట్ర డీజీపీకి ఎన్‌సీడబ్ల్యూ లేఖలు రాసింది. 

మరోవైపు సిద్ధార్థ్‌ ట్వీట్‌పై సైనా స్పందిస్తూ.. ‘‘ఆయన వ్యాఖ్యల అర్థం ఏంటో నాకు తెలియదు. నటుడిగా ఆయన్ని నేను అభిమానిస్తా. కానీ అతడు తన భావాలను మంచి పదాలతో వెల్లడించాల్సింది’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. అటు సైనా భర్త కశ్యప్‌ కూడా నటుడి వ్యాఖ్యలను ఖండించారు. ‘‘ఇది చాలా విచారకరం. మీ అభిప్రాయాలను వ్యక్తపర్చండి. కానీ, మంచి పదాలను ఎంచుకోండి’’ అని కశ్యప్‌ అన్నారు. అయితే, తన ట్వీట్‌ వివాదాస్పదం కావడంతో స్పందించిన సిద్ధార్థ్‌.. తాను ఎవరినీ అగౌరవపర్చాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలను చేయలేదన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని