Swara Bhaskar: నటి స్వర భాస్కర్‌ను చంపుతామంటూ బెదిరింపు లేఖ

బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ను (Swara Bhaskar) చంపుతామంటూ బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది.

Published : 30 Jun 2022 02:07 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ను (Swara Bhaskar) చంపుతామంటూ బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది. ముంబయిలోని వెర్సోవాలో నివాసముంటున్న స్వర భాస్కర్‌కు రెండు రోజుల క్రితం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్పీడ్‌ పోస్టు ద్వారా ఓ లేఖను పంపించారు. లేఖను అందుకున్న ఆమె వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణాపాయం ఉందంటూ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వెర్సోవా పోలీసులు వెల్లడించారు. హిందీలో రాసిన ఆ లేఖలో.. వీర్‌ సావర్కర్‌ (Veer Savarkar)ను అవమానిస్తే దేశ యువత సహించబోదని పేర్కొన్నట్లు సమాచారం.

సామాజిక విషయాలపై బహిరంగంగానే స్పందించే బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌.. పలు సందర్భాల్లో వీర్‌ సావర్కర్‌ను విమర్శిస్తూ సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. ‘బ్రిటిష్‌ ప్రభుత్వానికి సావర్కర్‌ క్షమాపణలు చెప్పారు. జైలు నుంచి విడుదల చేయాలని వేడుకున్నారు. అది కచ్చితంగా వీరత్వం కాదు’ అంటూ మీడియాలో వచ్చిన కథనానికి స్పందిస్తూ 2017లో ఆమె ఓ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా వీర్‌ సావర్కర్‌ పిరికివాడని పేర్కొంటూ 2019లోనూ ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఆ సమయంలో ఆమెపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా సావర్కర్‌ను విమర్శిస్తూ పలుసార్లు మాట్లాడిన నేపథ్యంలోనే ఆమెకు బెదిరింపు లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా ఉదయ్‌పుర్‌లో జరిగిన హత్యను ఖండిస్తూ స్వరభాస్కర్‌ ట్వీట్‌ చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని