Khushbu Sundar: వీల్‌ఛైర్‌ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం

గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న ఎయిరిండియాపై ప్రముఖ నటి ఖుష్బూ సుందర్‌ అసహనం వ్యక్తం చేశారు. మోకాలినొప్పితో బాధపడుతున్న తనకు వీల్‌ఛైర్‌ ఆలస్యంగా ఇచ్చారంటూ మండిపడ్డారు.

Published : 01 Feb 2023 01:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar)కు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న ఆమె.. ఎయిరిండియా (Air India) విమానం దిగిన తర్వాత వీల్‌ఛైర్‌ కోసం అరగంటపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన నటి.. ట్విటర్‌ వేదికగా ఎయిర్‌లైన్‌పై విమర్శలు గుప్పించారు.

‘‘డియర్‌ ఎయిరిండియా.. మోకాలి గాయంతో బాధపడుతున్న ప్రయాణికురాలిని తీసుకెళ్లేందుకు మీ వద్ద కనీసం వీల్‌ఛైర్‌ (Wheel Chair) కూడా లేదు. లిగ్మెంట్‌ గాయం కారణంగా కట్టుతో ఉన్న నేను చెన్నై ఎయిర్‌పోర్టులో చక్రాల కుర్చీ కోసం 30 నిమిషాలు ఎదురుచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత మీ సిబ్బంది మరో ఎయిర్‌లైన్ నుంచి వీల్‌ఛైర్‌ను తీసుకొచ్చి నన్ను తీసుకెళ్లారు’’ అని ఖుష్బూ మంగళవారం ట్విటర్‌లో వెల్లడించారు. కాగా.. నటి (Khushbu Sundar) ట్వీట్‌కు ఎయిరిండియా స్పందిస్తూ ఆమెకు క్షమాపణలు తెలియజేసింది. ‘‘మా వల్ల మీకు ఎదురైన అనుభవానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. దీన్ని వెంటనే చెన్నై ఎయిర్‌పోర్టు టీమ్‌ దృష్టికి తీసుకెళ్తాం’’ అని ఎయిర్‌లైన్‌ బదులిచ్చింది.

మూత్ర విసర్జన ఘటనలతో ఎయిరిండియా ఇటీవల తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖుష్బూ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఇది చాలా దారుణమంటూ పలువురు నెటిజన్లు నటికి మద్దతిస్తూ ట్వీట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని