Afghanistan: అమ్రుల్లా సలేహ్ దేశం విడిచి పారిపోయారా?

అఫ్గానిస్థాన్ అపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ దేశాన్ని విడిచి పరారైనట్లు తెలుస్తోంది.

Published : 03 Sep 2021 22:30 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న అమ్రుల్లా సలేహ్ దేశాన్ని విడిచి పరారైనట్లు తెలుస్తోంది. కొందరు పంజ్‌షేర్‌ కమాండర్లతో కలిసి రెండు విమానాల్లో తజికిస్థాన్‌కు వెళ్లిపోయినట్లు సమాచారం. అఫ్గాన్‌ పౌరుల స్వేచ్ఛ కోసం పంజ్‌షేర్‌ పోరాటం సాగిస్తుందని గురువారం పేర్కొన్న అమ్రుల్లా.. ఆ మరుసటి రోజే దేశాన్ని విడిచి వెళ్లినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. పంజ్‌షేర్‌ను తాలిబన్లు చుట్టుముట్టడంతో ప్రాణభయంతోనే ఆ ప్రాంతంలోని పలు ప్రధాన ఫైటర్లతో కలిసి పారిపోయినట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన ఖండించారు.

కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత అమ్రుల్లా సలేహ్‌ పంజ్‌షేర్‌ దళాలతో కలిసిపోయారు. అనంతరం పలుమార్లు తాలిబన్లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. అఫ్గాన్‌ ప్రజలకు వారి దేశం ఎలా ఉండాలో ఎంచుకునే హక్కు ఉందని, వారి వ్యక్తిగత గుర్తింపు కోల్పోవడం తమకు ఏ మాత్రం ఇష్టం లేదని పేర్కొన్నారు. అఫ్గాన్‌ను తాలిబనిస్థాన్‌ కానీయమని వెల్లడించారు. ‘నా హృదయంలోని అరుణ వర్ణం అఫ్గానిస్థాన్‌. ఈ గడ్డపై నుంచి నా ఆత్మను వేరుచేసే శక్తి ఒక్క భగవంతుడికే ఉంది’ అని కొద్దిరోజుల క్రితమే మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

మరోవైపు అమ్రుల్లా సలేహ్ శుక్రవారం పలు ట్వీట్లు చేశారు. ‘పంజ్‌షేర్‌కు అన్ని రకాల రాకపోకలపై నిషేధం విధించారు. ఫోన్‌ సిగ్నళ్లు, విద్యుత్తు సరఫరా, చివరకు వైద్య సంబంధిత సామగ్రిని కూడా నిలిపివేశారు’ అని ట్వీట్‌ చేశారు. ‘23 ఏళ్ల క్రితం ఎమర్జెన్సీ మొదలైనప్పటి నుంచి కూడా తాలిబన్లకు అత్యవసర వైద్య సదుపాయాలను మేం నిలిపివేయలేదు. తాలిబన్లు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. వారి ఈ తీవ్రవాద ప్రవర్తనను ఐక్యరాజ్య సమితి, ప్రపంచ నేతలు గుర్తించాలి’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే తాజా ట్వీట్లు సైతం ఆయన దేశం విడిచి వెళ్లిపోయారనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. పంజ్‌షేర్‌లో ఇంటర్నెట్‌ సేవలను తాలినబ్లు నిలిపివేశారని, అమ్రుల్లా అక్కడే ఉంటే ఈ ట్వీట్లు ఎలా చేయగలిగారని స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, దేశం విడిచి పారిపోయారని తనపై వస్తున్న ఆరోపణలను అమ్రుల్లా సలేహ్ కొట్టిపారేశారు. తాను పంజ్‌షేర్‌లోనే ఉన్నట్లు ఓ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించారు. ప్రస్తుతం తన బేస్‌పాయింట్‌నే నుంచే మాట్లాడుతున్నట్లు తెలిపారు. తమ కమాండర్లు, రాజకీయ నేతలతో ఇక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. పంజ్‌షేర్‌ వ్యాలీలోని పలు ప్రాంతాలను తాలిబన్లు హస్తగతం చేసుకున్నారనే వార్తలను సైతం ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రాంతం మొత్తం తమ అధీనంలోనే ఉన్నట్లు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని