Afghanistan: నాగ్​పుర్​లో మాయమై.. తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమై

భారత్​లో పదేళ్ల పాటు అక్రమంగా నివసించిన ఓ వ్యక్తి అనూహ్యంగా అఫ్గాన్‌లోని తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. అతడు తుపాకీ పట్టుకొన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.....

Published : 21 Aug 2021 01:30 IST

దిల్లీ: భారత్​లో పదేళ్ల పాటు అక్రమంగా నివసించిన ఓ వ్యక్తి అనూహ్యంగా అఫ్గాన్‌లోని తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. అతడు తుపాకీ పట్టుకొన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్​లో అక్రమంగా నివసిస్తున్న నూర్​ మహ్మద్ అజీజ్ మహ్మద్​ను దేశం నుంచి బహిష్కరించగా.. అతడు తాలిబన్లలో కలిసిపోయాడు. నూర్ మహ్మద్ గత పదేళ్లు నాగ్​పుర్​లోని దిఘోరీలో అక్రమంగా నివసించాడు. నిఘా వర్గాల సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఏడాది జూన్​ 23న అఫ్గానిస్థాన్​ పంపించేశారు. అయితే నూర్‌ తుపాకీ పట్టుకొని తాలిబన్లతో కలిసిన ఫొటో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

అఫ్గాన్‌ వెళ్లిన అనంతరం నూర్‌ మహ్మద్‌ తాలిబన్లలో కలిసిపోయి ఉండొచ్చని నాగ్‌పుర్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. 2010లో 6 నెలల పర్యాటక వీసాపై నాగ్​పుర్​కు వచ్చాడని అంతకుముందు దర్యాప్తులో తేలినట్లు ఆయన తెలిపారు. శరణార్థిగా గుర్తించాలని అతడు చేసిన దరఖాస్తు, అప్పీలును ఐరాస మానవ హక్కుల మండలి తిరస్కరించింది. అప్పటి నుంచి అక్రమంగా నాగ్​పుర్​లోనే ఉన్నాడని అధికారి వెల్లడించారు. నూర్​ అసలు పేరు అబ్దుల్​ హకీ అని.. అతడి సోదరుడు ఎప్పటినుంచో తాలిబన్లతో కలిసి పనిచేస్తున్నట్లు మరో అధికారి తెలిపారు. అదుపులోకి తీసుకున్న సమయంలో నూర్ ఎడమ భుజంలో బుల్లెట్ గాయాలను గుర్తించారు పోలీసులు. సామాజిక మాధ్యమాల్లో పలువురు ఉగ్రవాదులను అతడు అనుసరించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని