Afghanistan: అఫ్గాన్‌లో ‘చిన్నారి పెళ్లికూతుళ్లు’.. డబ్బు కోసం తండ్రులే అమ్మేస్తున్నారు..

తొమ్మిదేళ్ల పర్వానా మాలిక్‌.. బాగా చదువుకుని టీచర్‌ అవ్వాలని తన కల. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కలలను తుడిచేశాయి. పేదరికం ఆమెను వివాహ బంధంలోకి నెట్టేసింది

Published : 02 Nov 2021 15:44 IST

కాబుల్‌: పర్వానా మాలిక్‌కు తొమ్మిదేళ్లు.. బాగా చదువుకుని టీచర్‌ అవ్వాలని తన కల. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె కలలను తుడిచేశాయి. పేదరికం ఆమెను వివాహ బంధంలోకి నెట్టేసింది. అభం శుభం తెలియని పసి ప్రాయంలో 55ఏళ్ల వ్యక్తికి ఇల్లాలిని చేసింది. ఒక్క పూట తిండికి కూడా డబ్బుల్లేని పర్వానా తండ్రి.. కుటుంబాన్ని బతికించుకోవడం కోసం గత్యంతరం లేక తన 9ఏళ్ల కుమార్తెను పెళ్లి పేరుతో అమ్మకానికి పెట్టారు. ఒక్క పర్వానానే కాదు.. అఫ్గాన్‌లో అనేక మంది బాలికల దయనీయ పరిస్థితి ఇది..!

తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అఫ్గానిస్థాన్‌ ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. డబ్బులేక, చేసేందుకు పనిలేక వేలాది కుటుంబాలు పేదరికంలో మగ్గిపోతున్నాయి. ఈ క్రమంలోనే తండ్రులు తమ చిన్నారి కుమార్తెలను పెళ్లి పేరుతో విక్రయిస్తున్నారు. ఆ వచ్చిన డబ్బుతో కుటుంబానికి తిండిపెడుతున్నారు. 

బాద్ఘీస్‌ ప్రావిన్స్‌కు చెందిన అబ్దుల్‌ మాలిక్‌కు కూడా ఉపాధి లేకపోవడంతో తన 8 మంది కుటుంబసభ్యులను పోషించడం కష్టంగా మారింది. దీంతో రెండు నెలల క్రితం తన 12 ఏళ్ల కుమార్తెను ఓ పెద్ద వయసు వ్యక్తికి ఇచ్చి పెళ్లి కింద అమ్మేశాడు. ఆ వచ్చిన డబ్బుతో రెండు నెలలు నెట్టుకొచ్చాడు. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. దీంతో చేసేదేం లేక, తన 9ఏళ్ల మరో కుమార్తె పర్వానాను 55ఏళ్ల ఖూర్బాన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇందుకు బదులుగా ఖూర్బాన్‌..  మాలిక్‌ కుటుంబానికి గొర్రెలు, డబ్బు రూపంలో 2లక్షల అఫ్గానీలను చెల్లించాడు.

పర్వానాకు చదువుకోవాలని ఉన్నప్పటికీ.. కుటుంబ పరిస్థితుల కారణంగా తండ్రి మాటను ఒప్పుకోక తప్పలేదు. అయితే పెళ్లి అనే పేరుకు కనీసం అర్థం కూడా తెలియని పర్వానా.. వెక్కి వెక్కి ఏడుస్తూ ఖూర్బానాతో వెళ్లిపోయింది.  ఈ పనికి తాను సిగ్గుపడుతున్నప్పటికీ.. మిగతా కుటుంబ సభ్యులను బతికించుకోవడం కోసం మరో మార్గం కన్పించలేదని మాలిక్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ పక్కనే ఉన్న ఘోర్‌ ప్రావిన్స్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 10ఏళ్ల మగుల్‌ను తన తండ్రి డబ్బు కోసం 70ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు.

పర్వానా, మగుల్‌ మాత్రమే కాదు.. దాదాపు ప్రతి అఫ్గాన్‌ బాలికల పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన విషయం తెలిసిందే. ఆడపిల్లలను ఉన్నత విద్యకు తాలిబన్ల దూరం చేస్తున్నారు. దీనికి తోడు పేదరికం పెరిగిపోవడంతో విధిలేక తల్లిదండ్రులు, వారి బాలికలను బలవంతంగా వివాహ బంధంలోకి నెట్టేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని