Afghan: తాలిబన్లు వచ్చేశారు, మీ కోసం వెతుకుతున్నారు.. అందుకే ఘనీ పరార్!

అఫ్గానిస్థాన్​ దాదాపుగా తాలిబన్ల చేతికి వెళ్లిందన్న క్రమంలో దేశం విడిచి పారిపోయారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ. కోట్ల రూపాయలతో పరారైనట్లు వార్తలు రాగా.....

Published : 31 Aug 2021 01:39 IST

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్​ దాదాపుగా తాలిబన్ల చేతికి వెళ్లిందన్న క్రమంలో దేశం విడిచి పారిపోయారు ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ. కోట్ల రూపాయలతో పరారైనట్లు వార్తలు రాగా.. తాను కట్టుబట్టలతో దేశం విడిచినట్లు ఘనీ వెల్లడించారు. అయితే.. అధ్యక్షుడు అంత హడావుడిగా ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? అనే విషయాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది.

తాలిబన్లతో అధికారం పంచుకోవటం, భవిష్యత్తు కార్యాచరణ వంటి విషయాలపై చర్చించేందుకు ఆగస్టు 14న అధ్యక్ష భవనంలో అష్రఫ్​ ఘనీ తన సన్నిహితులతో భేటీ అయ్యారు. వారితో విస్తృతంగా చర్చలు సాగిస్తున్నారు. ఈ సందర్భంలోనే అఫ్గాన్‌లోని ఒక్కో ప్రాంతాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటున్న వార్తలు వరుసగా వస్తున్నాయి. ఈ క్రమంలో లంచ్​ సమయానికి ఘనీ మినహా అంతా భోజనానికి వెళ్లారు. సీన్‌ కట్‌ చేస్తే.. భోజనం చేసి వచ్చిన అధికారులకు అధ్యక్షుడు కనిపించలేదు. అమెరికా బలగాల ఉపసంహరణ గడువు (ఆగస్టు 31) వరకు అధ్యక్షుడిగా ఘనీ కొనసాగుతారని.. చర్చల ద్వారా అధికార బదలాయింపు జరుగుతుందని నమ్మకంతో ఉన్న అధికారులకు అధ్యక్షుడు కనిపించకపోవడంతో షాక్​ తగిలినట్లయింది.

ప్రతి గదిని వెతుకున్నారని చెప్పి..

ఉన్నతాధికారులంతా మధ్యాహ్న భోజనానికి వెళ్లిన క్రమంలో ఘనీకి అత్యంత సన్నిహిత అధికారి ఒకరు వచ్చి తాలిబన్లు ప్యాలెస్​లోకి ప్రవేశించారని, మీ కోసం ప్రతి గదిని వెతుకుతున్నారని చెప్పాడు. ఇక్కడే ఉంటే మిమ్మల్ని చంపేస్తారని హెచ్చరించాడు. దాంతో ఆందోళన చెందిన అష్రఫ్‌ ఘనీ.. దేశం విడిచేందుకు నిర్ణయించుకున్నారు. ఇంటికి వెళ్లి తనకు సంబంధించిన కొన్ని వస్తువులను తెచ్చుకుంటానని ఆ అధికారితో చెప్పినా.. ఆ అధికారి అందుకు ఒప్పుకోలేదు. మీకు సమయం లేదని, వెంటనే వెళ్లకపోతే ప్రాణాలకే ప్రమాదమని భయపెట్టాడు. దాంతో తన సన్నిహితులు, అధికారులకు సమాచారం ఇవ్వకుండానే హెలికాప్టర్​ ఎక్కి ఉజ్బెకిస్థాన్​ పారిపోయారు. అక్కడి నుంచి విమానం ద్వారా యూఏఈకి వెళ్లారు.

పొలిమేరల్లోనే ఉండిపోయిన తాలిబన్లు

అధ్యక్ష భవనంలోకి తాలిబన్లు ప్రవేశించారనే తప్పుడు సమాచారంతో గందరగోళానికి గురైన అధికారి వల్లే ఘనీ దేశం విడిచినట్లు వాషింగ్టన్​ పోస్ట్​ పేర్కొంది. నిజానికి గతంలో జరిగిన ఒప్పందానికి కట్టుబడిన తాలిబన్లు కాబుల్​ పొలిమేరల్లోనే ఉండిపోయారని, ప్యాలెస్​లోకి ప్రవేశించలేదని తెలిపింది. 1996లో తాలిబన్లు దేశాన్ని ఆక్రమించిన క్రమంలో అప్పటి అధ్యక్షుడిని ఏ విధంగా హత్య చేశారో ఊహించుకుని.. ఆ భయంతోనే ఘనీ దేశం విడిచి పారిపోయినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని