Afghanistan Crisis: తాలిబన్లకు షాక్‌.. హక్కుల కోసం రోడ్డెక్కిన మహిళలు

అఫ్గానిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్లు జోరుగా పావులు కదుపుతున్నారు. అమెరికా బలగాలు పూర్తిగా నిష్క్రమించడంతో సాధ్యమైనంత త్వరగా కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికే .....

Published : 02 Sep 2021 19:18 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై తాలిబన్లు జోరుగా పావులు కదుపుతున్నారు. అమెరికా బలగాలు పూర్తిగా నిష్క్రమించడంతో సాధ్యమైనంత త్వరగా కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నానికే కేబినెట్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంతమంది మహిళలు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో మహిళలకూ భాగస్వామ్యం కల్పించాలంటూ డిమాండ్‌ చేయడం గమనార్హం. ఇరాన్‌ సరిహద్దుకు సమీపంలోని హెరాత్‌ నగరంలోని సిల్క్‌ రోడ్డుపై కొందరు మహిళా కార్యకర్తలు, విద్యార్థులు, పలు ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ హక్కుల కోసం గళం విప్పారు. తాలిబన్ల ప్రభుత్వంలో మహిళలకు చోటు దక్కకపోవచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ నిరసనలు కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న అఫ్గానిస్థాన్‌లో ప్రజల్లో అపనమ్మకం, తీవ్ర అశాంతి వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో తాలిబన్లు ఏర్పాటు చేసే ప్రభుత్వంలో తమ హక్కుల కోసం మహిళలు గళం వినిపిస్తున్నారు. విద్య, భద్రతను, పనిని పొందడం తమ హక్కు అంటూ మహిళలు నినాదాలు చేశారు. తమకేం భయంలేదని.. అంతా ఐక్యంగా ఉన్నాం అంటూ దాదాపు 50 మంది మహిళలు ప్లకార్డులతో రోడ్డుపై నిరసన వ్యక్తంచేశారు. తాలిబన్‌ ప్రభుత్వ కేబినెట్‌లో మహిళలకు కూడా చోటు కల్పించాలని బసీరా తాహెరీ అనే మహిళ డిమాండ్‌ చేశారు. తాలిబన్లు తమతో చర్చలు జరపాలని కోరుకుంటున్నామన్నారు. తాలిబన్ల సమూహాల్లో, సమావేశాల్లో ఒక్క మహిళను కూడా తాము చూడలేదంటున్నారు. మహిళలు లేకుండా ప్రభుత్వం మనుగడ సాగించలేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 

అఫ్గాన్‌ మహిళలు ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పించినప్పటికీ వారికి కేబినెట్‌లో గానీ, ప్రభుత్వంలో, ఏ ఇతర ఉన్నత పదవుల్లో గానీ స్థానం కల్పించే అవకాశం లేదంటూ తాలిబన్ల సీనియర్‌ నేత మహమ్మద్‌ అబ్బాస్‌ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని