BRICS Summit: అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల గొంతుక ‘బ్రిక్స్‌’: మోదీ

ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ ప్రణాళికకు బ్రిక్స్‌ దేశాలు ఆమోదం తెలిపాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పొరుగు దేశాలకు ముప్పుగా అఫ్గానిస్థాన్‌ మారకుండా...........

Published : 09 Sep 2021 22:15 IST

బ్రిక్స్‌ సమ్మిట్‌కు అధ్యక్షత వహించిన ప్రధాని

దిల్లీ: ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ ప్రణాళికకు బ్రిక్స్‌ దేశాలు ఆమోదం తెలిపాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పొరుగు దేశాలకు ముప్పుగా అఫ్గానిస్థాన్‌ మారకుండా చూడాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. డ్రగ్స్‌ రవాణా, ఉగ్రవాదానికి మూలంగా అఫ్గాన్‌ మారరాదన్నారు. భారత్‌ అధ్యక్షతన బ్రిక్స్‌ దేశాల సమావేశం గురువారం వర్చువల్‌గా జరిగింది. భారత్‌, చైనా, రష్యా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా అధినేతలు హాజరయ్యారు. ఛైర్మన్‌ హోదాలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 15ఏళ్లుగా బ్రిక్స్‌ అనేక విజయాలు సాధించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల గొంతుకగా నిచిందని తెలిపారు. రాబోయే 15 ఏళ్లలో మరింత పనితీరు కనబర్చాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలపై దృష్టి పెట్టేందుకు సైతం ఈ వేదిక ఉపయోగకరంగా ఉందన్నారు. 

ఎవరెవరు ఏమన్నారంటే..

ఇతర దేశాలపై దాడుల కోసం ఉగ్రవాద సంస్థలు అఫ్గాన్‌ భూభాగాన్ని వేదికగా మార్చుకోకుండా నిరోధించాలనే అంశంపై బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయం వ్యక్తంచేశాయి. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల ఉత్పత్తితో అఫ్గాన్‌.. తన పొరుగు దేశాలకు ముప్పుగా మారొద్దని రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్ సూచించారు. అంతర్జాతీయ వేదికపై బ్రిక్స్ కీలక శక్తిగా ఎదిగిందని, గత దశాబ్దన్నర కాలంలో బ్రిక్స్‌ దేశాలు పరస్పర వ్యూహాత్మక సమాచార మార్పిడిని ఎంతో మెరుగుపర్చుకున్నాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అన్నారు. కొవిడ్‌ కట్టడి విషయంలో సమష్టి స్పందన, భాగస్వామి దేశాలు ఐకమత్యంతో పనిచేస్తే ఏం సాధించవచ్చో నిరూపించిందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమాఫోసా అన్నారు. అందరికీ సమానంగా కొవిడ్ టీకాలు దక్కాలని కోరారు. బ్రెజిల్, భారత్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం అద్భుతంగా ఉందని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని