Hathras Stampede: అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!

భోలే బాబా (Bhole Baba) అద్భుతాలు చేయగలిగితే.. తన సత్సంగ్‌ కార్యక్రమానికి వచ్చిన మృతులను ఎందుకు బతికించలేదని హాథ్రస్‌ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.

Updated : 05 Jul 2024 19:29 IST

హాథ్రస్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని (Uttarpradesh) హాథ్రస్‌ (Hathras) జిల్లాలో జరిగిన తొక్కిసలాట పలు కుటుంబాల్లో చీకట్లు నింపింది. తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైనవారు కొందరైతే.  అమ్మానాన్నల వెంట వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన వారు మరికొందరు. బాధిత కుటుంబాల్లో ఎవరిని కదిలించినా కన్నీటి గాథలు వెలుగులోకి వస్తున్నాయి. యూపీకి చెందిన చోటేలాల్‌ ఆయన భార్య మంజుదేవితో కలిసి గత ఐదారేళ్ల నుంచి ‘భోలే బాబా’ (Bhole Baba) సత్సంగానికి వెళ్తున్నారు. భోలే బాబా ప్రసంగాలతో ఎంతో కొంత మంచిని నేర్చుకుంటాడన్న ఆశతో మంగళవారం తమ ఆరేళ్ల కుమారుడిని కూడా వెంట తీసుకెళ్లారు. అదే ఆ బాలుడికి చివరి రోజైంది. తొక్కిసలాటలో మంజుదేవితోపాటు, కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు.

‘‘తొక్కిసలాట మొదలైనప్పుడు నేను ప్రధాన గేటు దగ్గరే ఉన్నాను. జనం నుంచి తప్పించుకునే క్రమంలో నా భార్య నీటితో నింపిన చిన్న కుండీలో పడిపోయి ఊపిరాడక చనిపోయింది. అక్కడే ఉన్న నా కుమారుడు కూడా తొక్కిసలాటలో ప్రాణాలొదిలాడు. జనాన్ని నెట్టుకుంటూ వారి దగ్గరికి వెళ్లలేక కొడుకు, భార్యను కోల్పోయాను’’ అంటూ చోటేలాల్‌ కన్నీరుమున్నీరయ్యారు. ఆయన లాంటి ఎంతో మందికి ఈ దుర్ఘటన తీరని ఆవేదన మిగిల్చింది. హాథ్రస్‌లోని వివిధ మార్చురీల్లో ఉన్న తమవారిని గుర్తించేందుకు వెళ్లిన బంధువుల రోదనలు గుండెల్ని పిండేస్తున్నాయి.  ‘‘దాదాపు గత పదేళ్లుగా భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమాలకు వెళ్తున్నాం. ఇలాంటి ఘోరం ఎప్పుడూ జరగలేదు. తొక్కిసలాటలో మా అత్తమ్మ చనిపోయారు. ఆమే మా కుటుంబానికి వెన్నెముక. మేం బాధల్లో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మా మధ్య లేరు. అసలు ఈ దారుణం ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు’’ అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా ఎంతో మంది మీడియా ఎదుట తమ కన్నీటిగాథలను వినిపిస్తున్నారు. వారంతా అడిగే ఏకైక ప్రశ్న ఒక్కటే.  ‘‘భోలే బాబా అద్భుతాలు చేస్తారని మేం అందరం నమ్ముతున్నాం. ఆయన్ని దైవస్వరూపంగా కొలుస్తున్నాం. అదే నిజమైతే.. ఇంత దారుణం ఎలా జరిగింది? ఒక వేళ జరిగినా తన కోసం వచ్చిన భక్తులను తన అద్భుతాలతో తిరిగి ఎందుకు బతికించలేదు?’’ అని నిస్సహాయతతో ప్రశ్నిస్తున్నారు. ప్రాణాలతో బయటపడిన వారు తమ భయంకరమైన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. ‘‘ తొక్కిసలాటలో చిక్కుకొని తప్పించుకునే ప్రయత్నం చేశాను. ఇంతలో ఒక్కసారిగా నాపై జనం పడిపోయారు. స్పృహ కోల్పోయా. లేచి చూసేసరికి ఆస్పత్రిలో ఉన్నా. దేవుడి దయవల్ల ప్రాణాలతో బయటపడ్డా’’ అంటూ చికిత్స పొందుతున్న బాధితుడొకరు చెప్పారు. ‘‘ ఎటు చూసినా జనం పరుగులు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది. నా కాలికి గాయమైంది. భయంతో స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. చివరికి ఆస్పత్రిలో నా వారిని కలుసుకున్నాను’’ అంటూ ఓ మహిళ మీడియా ఎదుట తన ప్రత్యక్ష అనుభవాన్ని చెప్పుకొచ్చారు.

భోలే బాబా సత్సంగ్‌ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మంగళవారం 121 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వందల మంది గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లా ఫుల్‌రయీ గ్రామంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో ప్రసిద్ధుడైన భోలే బాబా దర్శనం కోసం ఒక్కసారిగా జనం ఎగబడటంతోపాటు ఆయన పాదాల చుట్టూ ఉన్న మట్టిని సేకరించేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని