Nagaland: ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిందే.. ఈశాన్యరాష్ట్రాల సీఎంల డిమాండ్‌

నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో ఇటీవల భద్రతాబలగాల కాల్పుల్లో పౌరులు మృతి చెందిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కశ్మీర్‌తోపాటు ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు డిమాండ్‌...

Published : 07 Dec 2021 02:09 IST

కోహిమా: నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో ఇటీవల భద్రతాబలగాల కాల్పుల్లో పౌరులు మృతి చెందిన ఘటన చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కశ్మీర్‌తోపాటు ఈశాన్య భారతంలో సైన్యానికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు డిమాండ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయమై స్థానికులు, పౌర సంఘాలు, హక్కుల కార్యకర్తలనుంచి పెద్దఎత్తున డిమాండ్‌లు వస్తున్నాయి.

తాజాగా నాగాలాండ్‌, మేఘాలయ ముఖ్యమంత్రులు నెయ్‌ప్యూ రియో, కాన్రాడ్‌ సంగ్మా సైతం.. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కాల్పుల్లో మరణించిన పౌరుల అంత్యక్రియలకు హాజరైన సందర్భంగా రియో మాట్లాడుతూ.. ఏఎఫ్‌ఎస్‌పీఏను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. గతంలో తిరుగుబాట్లను ఎదుర్కొనేందుకు ఈ చట్టాన్ని అమలు చేశారని, ఇప్పుడు ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. కాన్రాడ్‌ సంగ్మా సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాలంటూ సోమవారం ట్వీట్‌ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులూ ఇదే విధంగా స్పందిస్తున్నారు.

కశ్మీర్‌తోపాటు ఈశాన్య భారతంలో కల్లోలిత ప్రాంతాలను గుర్తించి, అక్కడ శాంతిభద్రతలను కాపాడేందుకు సైన్యానికి ప్రత్యేక అధికారాలు కట్టబెడుతూ కేంద్రం ఈ చట్టాన్ని తెచ్చింది. ప్రస్తుతం అస్సాం, నాగాలాండ్, మణిపూర్‌(మణిపూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏరియా మినహా), అరుణాచల్‌ప్రదేశ్‌లోని చాంగ్‌లాంగ్, లాంగ్‌డింగ్, తిరప్‌ జిల్లాల్లో ఈ చట్టం అమలులో ఉంది. మణిపూర్‌ ఉక్కుమహిళగా పేరు పొందిన ఇరోమ్‌ షర్మిల సైతం ఇదే చట్టం రద్దు కోరుతూ దాదాపు 16 ఏళ్లపాటు దీక్ష చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని