Kapil Sibal: సుపారీ ఇచ్చినవారి పేర్లు చెప్పండి..! ప్రధాని మోదీకి కపిల్‌ సిబల్‌ విజ్ఞప్తి

తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని.. ఇందుకోసం కొందరు సుపారీ కూడా  ఇచ్చారని ప్రధాని మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఎంపీ కపిల్‌ సిబల్‌ (Kapil Sibal) .. సుపారీ ఇచ్చిన వారి పేర్లు బహిరంగ పరచాలని.. తద్వారా విచారించే వీలుంటుందని విజ్ఞప్తి చేశారు.

Published : 02 Apr 2023 13:49 IST

దిల్లీ: భారత్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని లండన్‌లో రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఇటీవల వ్యాఖ్యానించడం దేశ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. అనంతరం ఓ క్రిమినల్‌ పరువు నష్టం కేసులో రాహుల్‌ దోషిగా తేలడంతో ఆయన లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడింది. ఈ అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని బ్రిటన్‌, జర్మనీ ప్రకటించిన నేపథ్యంలోనే ‘తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని.. ఇందుకోసం సుపారీ కూడా ఇచ్చారంటూ’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రాజ్యసభ ఎంపీ కపిల్‌ సిబల్‌ స్పందించారు. సుపారీ (Supari) ఇచ్చిన వారి పేర్లు చెప్పాలని.. తద్వారా వారిని విచారించేందుకు వీలుంటుందని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.

‘తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తన సమాధి కట్టేందుకు కూడా కొందరు సుపారీ ఇచ్చారని మోదీజీ ఆరోపించారు. 1) వ్యక్తులు 2) సంస్థలు 3) దేశాలు.. వీరిలో ఎవరున్నా.. వారి పేర్లు చెప్పండి. ఇది దేశ రహస్యం కాకూడదు. వారిని విచారిద్దాం’ అని కపిల్‌ సిబాల్‌ స్పందించారు.

శనివారం భోపాల్‌లో రాణి కమలాపతి స్టేషన్‌లో వందేభారత్‌ రైలును ప్రారంభించిన అనంతరం మాట్లాడిన మోదీ.. సుపారీ వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి వారికి మద్దతుగా కొందరు దేశం లోపల, మరికొందరు దేశం బయట ఉండి పనిచేస్తున్నారని మోదీ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని