Agnipath: అగ్నివీరుల వయోపరిమితిని పెంచాలి: ఆర్మీ

అగ్నిపథ్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న అగ్నివీరుల వయోపరిమితి, సర్వీస్ పొడిగింపుపై ఆర్మీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నట్లుగా సైనిక అధికారులు శుక్రవారం తెలిపారు.

Published : 06 Jul 2024 16:43 IST

దిల్లీ: అగ్నిపథ్‌లో చేరేవారి వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50శాతం మంది అగ్నివీర్‌లను కొనసాగించాలని కేంద్రాన్ని సైన్యం కోరనున్నట్లు తెలుస్తోంది. 

సైనికుల నియామకం కోసం అగ్నిపథ్‌ పథకం రెండు సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చింది. అయితే ప్రతిపక్షాలు, ఆర్మీ అభ్యర్థులు దీనిని వ్యతిరేకించారు. అగ్నిపథ్‌ పథకాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే సైన్య నియామకం చేపట్టాలని దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. నిరసనల మధ్య రెండేళ్ల క్రితం కేంద్రం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 17నుంచి 21 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు మాత్రమే అగ్నివీర్‌లుగా విధులు నిర్వహించేందుకు అర్హులుగా కేంద్రం పేర్కొంది. నాలుగేళ్లు ముగిసిన అనంతరం సర్వీస్‌ నుంచి తప్పుకున్న అగ్నివీర్‌లకు ఎటువంటి ఆర్థిక సాయం, పెన్షన్ సౌకర్యాలు ఉండవు. వారిలో 25శాతం మందిని మరో 15 సంవత్సరాల పాటు రెగ్యులర్ సర్వీస్‌లో కొనసాగిస్తారు. 

‘‘అగ్నివీర్‌లుగా నియమించిన వారిలో కేవలం 25శాతం మందినే తిరిగి విధుల్లో కొనసాగించడం వల్ల  సైనిక బలం తగ్గే అవకాశం ఉంటుంది. దీనిని నివారించడానికి మరి కొంతమందిని కూడా తిరిగి సర్వీస్‌లో చేర్చుకోవాలి. ఎంతో శ్రమపడి సైనికులకు శిక్షణ ఇచ్చినప్పుడు వారి సేవలను పూర్తి మొత్తంలో ఉపయోగించుకోవాలి’’ అని నేవీ విశ్రాంత అధికారి కేబీ సింగ్ తెలిపారు.

ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)  మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్‌లోని నౌషేరాలో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడులో మరణించిన అగ్నివీర్‌ తండ్రికి ఎటువంటి పరిహారం అందలేదని మండిపడ్డారు. అగ్నివీర్‌ తండ్రి వీడియోను విడుదల చేశారు. అగ్నివీరులకు అమరవీరుల హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అయితే సైన్యం దీనిపై వివరణ ఇచ్చింది. పరిహారంలో కొంత భాగాన్ని అగ్నివీర్ అజయ్ కుమార్ బంధువులకు చెల్లించామని, మిగిలిన మొత్తాన్ని త్వరలో పంపిణీ చేస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని