Agnipath: మీకు అండగా నిలుస్తాం.. శాంతియుతంగా పోరాడండి: సోనియా గాంధీ

‘అగ్నిపథ్‌’ పథకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో మా పార్టీ మీకు అండగా నిలుస్తుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ హామీ ఇచ్చారు.......

Published : 18 Jun 2022 16:36 IST

దిల్లీ: సాయుధ బలగాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఈ వివాదాస్పద పథకాన్ని ఉపసంహరించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో పార్టీ మీకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. కానీ నిరసనను శాంతియుతంగా జరపాలని అభ్యర్థులను కోరారు.

ఆర్మీ ఉద్యోగార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోకుండా.. దిశానిర్దేశం లేని ఈ కొత్త సైనిక రిక్రూట్‌మెంట్ పథకాన్ని ప్రకటించారని కాంగ్రెస్ చీఫ్ ఓ ప్రకటనలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వం మీ భావాలను విస్మరించి దిక్కు, దిశ లేని కొత్త రకం సైనిక రిక్రూట్‌మెంట్‌ పథకాన్ని ప్రకటించడం తీవ్ర నిరాశకు గురిచేసింది. చాలా మంది మాజీ సైనికులు కూడా కొత్త పథకంపై ప్రశ్నలు లేవనెత్తారు’ అని సోనియా గాంధీ పేర్కొన్నారు. కొవిడ్ తదనంతర సమస్యలతో దిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోనియా చేసిన ఈ ప్రకటనను పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.

అంతకుముందు కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ సైతం ‘అగ్నిపథ్‌’ అంశంపై మాట్లాడారు. రైతుల సుదీర్ఘ నిరసనల అనంతరం సాగు చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయాన్ని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తాజాగా గుర్తుచేశారు. అదే తరహాలో సైనికుల నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సైతం వెనక్కి తీసుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని