Agnipath: ‘అగ్నిపథ్‌’.. రక్షణశాఖకు అనవసర భారమే: వరుణ్‌ గాంధీ ఫైర్‌

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త సర్వీసు ‘అగ్నిపథ్‌’ పథకంపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి ముప్పు పొంచి ఉన్నవేళ.. ఈ పథకం

Updated : 16 Jun 2022 13:37 IST

రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాసిన భాజపా ఎంపీ

బిహార్‌లో హింసాత్మకంగా మారిన నిరసనలు

దిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త సర్వీసు ‘అగ్నిపథ్‌’ పథకంపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశానికి ముప్పు పొంచి ఉన్న వేళ.. ఈ పథకం సాయుధ బలగాల సామర్థ్యాన్ని బలహీనపర్చేలా ఉందని కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా సొంత పార్టీ నేత కూడా ‘అగ్నిపథ్‌’పై విమర్శలు చేశారు. ఇది రక్షణశాఖకు అనవసర భారమే అని భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ అన్నారు. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు.

‘‘సైనిక నియామకాల్లో మార్పుల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై యువతలో అనేక ప్రశ్నలు, సందేహాలున్నాయి. నాలుగేళ్ల తర్వాత 75శాతం అగ్నివీరులు ఎలాంటి పింఛను సదుపాయం లేకుండా రిటైర్‌ అవుతారు. అలా రిటైర్‌ అయిన వారు ‘నిరుద్యోగులు’గా మిగిలిపోతారు. ఏటా ఈ నిరుద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుంటుంది. ఇది యువతలో మరింత అసంతృప్తిని పెంచుతుంది. అంతేగాక, 15 ఏళ్ల తర్వాత రిటైర్‌ అయిన రెగ్యులర్‌ సైనికులను తీసుకునేందుకే కార్పొరేట్‌ రంగం అంతగా ఆసక్తి చూపించదు. అలాంటప్పుడు మరి వీరి పరిస్థితి ఎలా ఉంటుంది? నాలుగేళ్లు సైన్యంలో చేరితే అది వారి చదువుపై ప్రభావం చూపుతుంది. సర్వీసు పూర్తయిన తర్వాత ఉద్యోగం సాధించాలన్నా.. ఉన్నత చదువులు చదవాలన్నా వారు ఇబ్బందులు పడాల్సిందే. నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతం మంది అగ్నివీరులు మాత్రమే సైన్యంలో కొనసాగుతారు. అంటే ఈ పథకం వల్ల సైనికుల శిక్షణ ఖర్చు వృథా అన్నట్లే కదా. ఈ పథకం రక్షణ బడ్జెట్‌పై అనవసర భారమే’’ అని వరుణ్‌ గాంధీ లేఖలో పేర్కొన్నారు.

బిహార్‌లో తీవ్ర ఉద్రిక్తత..

మరోవైపు అగ్నిపథ్‌ పథకంపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల సర్వీసు తర్వాత తమ పరిస్థితి ఏంటంటూ సైనిక నియామకాల కోసం ప్రిపేర్‌ అవుతున్న యువకులు రోడ్లెక్కి ఆందోళన చేపట్టారు. నిరసనకారుల ఆగ్రహజ్వాలలతో బిహార్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల ఆందోళనకారులు పోలీసు వాహనాలు, సిబ్బందిపైకి రాళ్లు విసిరారు. ఓ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుకు నిప్పు పెట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని