టీకా పంపిణీలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అవసరం

వ్యాక్సిన్ పంపిణీని పెద్దయెత్తున చేపట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం చాలా ముఖ్యమని ఎయిమ్స్‌ డైరక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. శనివారం ఓ సమావేశంలో ప్రసంగించిన ఆయన పై విధంగా పేర్కొన్నారు.

Published : 20 Feb 2021 23:12 IST

ఎయిమ్స్‌ డైరక్టర్‌ రణదీప్‌ గులేరియా

దిల్లీ: వ్యాక్సిన్ పంపిణీని పెద్దఎత్తున చేపట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం చాలా ముఖ్యమని ఎయిమ్స్‌ డైరక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. శనివారం ఓ సమావేశంలో ప్రసంగిస్తూ ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గడం మంచి పరిణామమన్నారు. కరోనా మరణాలను తగ్గించడానికి వ్యాక్సినే ఆయుధమన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీని పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు. ‘‘ ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ సిబ్బందికి వ్యాక్సిన్లు వేయడం సులభమే. ఈ మొదటి దశ పూర్తైన తర్వాత అసలు సవాలు ఎదురవుతుంది. దీని కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అభివృద్ది చెందాలి. అప్పుడే వ్యాక్సిన్‌ను పంపిణీ చేయగలం. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి సమయంలో సామాన్య ప్రజలకు వ్యాక్సిన్లను అందించడం ప్రారంభిస్తే, కరోనాను నిర్మూలించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.’’ అని గులేరియా అన్నారు. వివిధ దేశాల్లో వైరస్‌ వేరియంట్స్‌ పుట్టుకొస్తున్న నేపథ్యంలో మనం ఎంత త్వరపడితే అంత మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరోగ్య రంగంలో స్వావలంబన

కరోనా కారణంగా ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నామని గులేరియా అన్నారు. కరోనా సంక్షోభ ప్రారంభంలో భారత్‌లో పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, ఎన్‌95 మాస్కుల కొరతతో ఇబ్బందులు పడ్డామన్నారు. వైరస్‌ నిర్ధరణ పరీక్షల కోసం కూడా సరైన సదుపాయాలు లేవని ఆయన తెలిపారు. ఇప్పుడు వ్యాక్సిన్లను తయారుచేయడంతో పాటు పీపీఈ కిట్లు, వెంటిలేటర్లు, మాస్కులు మనమే తయారు చేసుకొనేలా అభివృద్ధి చెందామని ఆయన వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించడంలో ఆరోగ్యరంగం కీలకంగా ఉంటుందన్నారు. సమావేశంలో అంతకుముందు అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి మాట్లాడుతూ.. కరోనా కాలంలో దేశ ప్రభుత్వ చర్యలను కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని