Published : 08 Apr 2022 01:48 IST

Air India: దిల్లీ - మాస్కో ఎయిరిండియా విమానాలు రద్దు..!

దిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ - మాస్కో(రష్యా రాజధాని) మధ్య నడిచే ఎయిరిండియా విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యుద్ధం దృష్ట్యా బీమా సమస్యలు తలెత్తడం వల్లే ఈ విమానాలను రద్దు చేసినట్లు సమాచారం.

దిల్లీ - మాస్కో మధ్య వారానికి రెండు సార్లు ఎయిరిండియా విమాన సర్వీసులను నడుపుతోంది. అయితే, వీటిని తాజాగా రద్దు చేశారని రష్యన్‌ ఎంబసీ ఓ ప్రకటనలో చెప్పినట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ ‘టాస్‌’ కథనం వెల్లడించింది. ‘‘దిల్లీ - మాస్కో - దిల్లీ మార్గంలో విమాన టికెట్ల విక్రయాలను భారత్‌కు చెందిన ఎయిరిండియా నిలిపివేసింది. ఈ మార్గంలో సేవలను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై స్పష్టత లేదు. ఈ మార్గంలో ఎయిరిండియా విమాన టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు నగదు రీఫండ్‌ చేయనున్నారు’’ అని ఎంబసీ తెలిపింది.

దిల్లీ - మాస్కో విమానాల రద్దుపై ఎయిరిండియా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం దృష్ట్యా విమానాలకు అధిక ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో మాస్కో వెళ్లే ఎయిరిండియా విమానాలకు బీమా కవరేజ్‌ ఇచ్చేందుకు సంస్థలు ముందుకు రావట్లేదట. అందువల్లే ఈ సర్వీసులను రద్దు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, దిల్లీ - మాస్కో మార్గంలో సేవలు నిలిచిపోయినా.. ప్రయాణికులు తాష్కెంట్‌, ఇస్తాంబుల్‌, దుబాయి, అబుదాబీ, దోహా నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్కడకు వెళ్లే సదుపాయం ఉంది.

ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాపై ప్రపంచ దేశాలు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఆంక్షలకు క్రెమ్లిన్‌ కూడా దీటుగానే స్పందించింది. ఐరోపా సమాఖ్యలోని 27 సభ్యదేశాలు సహా 36 దేశాల నుంచి విమానాలు రాకుండా రష్యా తమ గగనతలాన్ని మూసివేసింది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని