Air India: రూ.5లక్షలు పెట్టి టికెట్‌ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం

ఎయిరిండియా (Air India) ప్రయాణంలో చేదుఘటన ఎదురైందంటూ ఒక ప్రయాణికుడు కొన్ని చిత్రాలను షేర్ చేశారు. 

Published : 17 Jun 2024 18:06 IST

దిల్లీ: ఎయిరిండియా (Air India) విమాన ప్రయాణంలో పీడకలలాంటి అనుభవం ఎదురైందని ఓ ప్రయాణికుడు నెట్టింట అసహనం వ్యక్తం చేశారు. దిల్లీ నుంచి న్యూజెర్సీ వెళ్లిరావడానికి రూ.5లక్షలు పెట్టి బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌ కొన్నా..సంస్థ అందించిన సేవలు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. వినీత్‌ పేరిట ఎక్స్‌ ఖాతాలో ఈ విషయాలు వెల్లడించారు.

‘‘దిల్లీ నుంచి చికాగో, లండన్‌, న్యూయార్క్‌కు నేరుగా వెళ్లేందుకు వీలు ఉండటంతో కొద్దికాలంగా ఎయిరిండియా విమానాల్లో ప్రయాణిస్తున్నాను. కానీ ఇటీవలి ప్రయాణం మాత్రం పీడకలలాంటి అనుభవాన్ని మిగిల్చింది. టేకాఫ్ తర్వాత కొద్దిసేపటికి నిద్రపోదామని చూస్తే..సీటు వంగలేదు. తర్వాత అడిగి, మరో సీటు మార్పించుకున్నాను. నిద్రలేచిన తర్వాత తిందామని చూస్తే.. వారు వడ్డించిన ఆహారం సరిగా ఉడకలేదు. అంతకుముందు ఎయిరిండియాలో ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. పండ్లు తాజాగా లేవు. అంతా వాటిని తిరిగి ఇచ్చేశారు. టీవీ స్క్రీన్లు పనిచేయలేదు. చివరకు నా లగేజీకూడా దెబ్బతిన్నది’’ అంటూ సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఆ చిత్రాలను షేర్  చేశారు. మరో ఘటనలో ఒక ఎయిరిండియా ప్రయాణికుడికి వడ్డించిన ఆహారంలో బ్లేడ్ కనిపించింది.

ఈ రెండు ఘటనలపై సంస్థ స్పందించింది. వారికి కలిగిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేసింది. తమ సమావేశాల్లో దీనిపై చర్చిస్తామని, టికెట్ బుకింగ్, సీటు వివరాలు షేర్ చేయాలని వినీత్‌ను కోరింది. ఇక రెండో ఘటనలో ఆహారంలో బ్లేడ్ వచ్చిందన్న విషయాన్ని ధ్రువీకరించింది. అది వెజిటేబుల్ ప్రాసెసింగ్ మెషిన్‌దని వెల్లడించింది. ఇలాంటివి పునరావృతం కాకుండా కేటరింగ్ సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని