Air India: విమానం రష్యాకు మళ్లించిన ఘటన.. ప్రయాణికులకు ఎయిరిండియా ఆఫర్‌

Delhi-San Francisco flight: సాంకేతిక సమస్య కారణంగా రష్యాలో కొన్ని గంటల పాటు చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ఎయిరిండియా (Air India) రీఫండ్‌ ఆఫర్‌ ప్రకటించింది. 

Updated : 08 Jun 2023 16:10 IST

దిల్లీ: దిల్లీ (Delhi) నుంచి బయల్దేరి సాంకేతిక లోపం కారణంగా 39 గంటల పాటు రష్యా (Russia)లో చిక్కుకుపోయిన ఎయిరిండియా (Air India) ప్రయాణికులు ఎట్టకేలకు అమెరికా చేరుకున్నారు. ముంబయి నుంచి వెళ్లిన ప్రత్యేక విమానం.. ఆ ప్రయాణికులను తీసుకుని గురువారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco)లో ల్యాండ్‌ అయ్యింది. అయితే, ఈ ఘటనతో తీవ్ర అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు ఎయిరిండియా క్షమాపణలు చెప్పింది. అంతేగాక, వారికి రీఫండ్‌ (Refund) ఆఫర్‌ కూడా ప్రకటించింది. (Delhi - San Francisco flight)

‘‘శాన్‌ఫ్రాన్సిస్కోకు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు చాలా ఆలస్యమైనందుకు క్షమాపణలు తెలియజేస్తున్నాం. విమానంలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఒక ఇంజిన్‌లో ఆయిల్‌ ప్రెజర్‌ తక్కువగా ఉన్నట్లు సంకేతాలు రావడంతో పైలట్ అత్యవసర పరిస్థితుల్లో సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్టులో విమానాన్ని ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. మీ భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యం. చిన్న నగరమైన మదగన్‌లో సౌకర్యాలు అంతగా లేకపోయినా మేం సాధ్యమైన సేవలు అందించేందుకు ప్రయత్నించాం. మిమ్మల్ని గమ్యస్థానానికి చేర్చేందుకు మరో విమానాన్ని పంపించినా.. అది కాస్త ఆలస్యమైంది. మీ సహనానికి మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం. గతాన్ని మేం మార్చలేం. కానీ మీకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తున్నాం. ఇందుకు గానూ.. మీ ప్రయాణానికి పూర్తి రీఫండ్‌ (Refund) ఇవ్వనున్నాం. దీంతో పాటు భవిష్యత్తులో మా విమానాల్లో ప్రయాణించేందుకు ఓ ట్రావెల్‌ వోచర్‌ (Travel Voucher)ను కూడా ఇస్తున్నాం’’ అని ఎయిరిండియా (Air India) ఓ ప్రకటనలో వెల్లడించింది.

దిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయల్దేరిన ఎయిరిండియా AI173 విమానంలోని ఓ ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో అది రష్యాలో అత్యవసరంగా దిగిన విషయం తెలిసిందే. జూన్‌ 6వ (మంగళవారం) తేదీన ఉదయం 4.05 గంటలకు దిల్లీ నుంచి బయల్దేరిన ఈ విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్లు.. వెంటనే విమానాన్ని రష్యా వైపు మళ్లించారు. మధ్యాహ్నం 2.10 గంటలకు ఈ విమానాన్ని మదగన్‌ (Magadan) ఎయిర్‌పోర్టులో సురక్షితంగా దించారు. ఈ విమానంలో 216 మంది ప్రయాణికులతో పాటు 16 మంది సిబ్బంది ఉన్నారు. దాదాపు 39 గంటల పాటు రష్యాలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఎయిరిండియా మరో ప్రత్యేక విమానాన్ని పంపించింది. అలా ఈ ఉదయం మదగన్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికులను తీసుకుని బయల్దేరిన ఈ విమానం శాన్‌ఫ్రాన్సిస్కోలో సురక్షితంగా ల్యాండ్‌ అయినట్లు ఎయిరిండియా (Air India) వెల్లడించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని