Air India: ఎయిరిండియా విమానంలో భారీ కుదుపు.. ప్రయాణికులకు గాయాలు

దిల్లీ నుంచి సిడ్నీకి (Delhi-Sydney flight) బయలుదేరిన ఎయిరిండియా విమానం (Air India) భారీ కుదుపునకు లోనవడంతో అందులోని ప్రయాణికుల్లో ఏడుగురు గాయపడ్డారు.

Published : 17 May 2023 15:22 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ నుంచి ఆస్ట్రేలియా బయలుదేరిన ఓ ఎయిరిండియా (Air India) విమానం భారీ కుదుపునకు (Turbulence) లోనయ్యింది. దీంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయారు. ఈ ఘటనలో పలువురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయితే, ఏడుగురికి స్వల్ప గాయాలయ్యాయని.. వారిలో ఏ ఒక్కరు కూడా ఆస్పత్రిలో చేరలేదని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) వెల్లడించింది.

‘ఎయిరిండియాకు (Air India) చెందిన బీ787-800 విమానం దిల్లీ నుంచి ఆస్ట్రేలియాలోని సిడ్నీకి (Delhi-Sydney flight) బయలుదేరింది. విమానం గాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ ఒడిదొడుకులకు లోనయ్యింది. దీంతో అందులోని ప్రయాణికుల్లో ఏడుగురు తీవ్రంగా వణికిపోయారు. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది.. అందులో ప్రయాణిస్తున్న ఓ వైద్యుడు, నర్సు సహాయంతో వారికి ప్రథమ చికిత్స చేశారు’ అని డీజీసీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. విమానం సిడ్నీ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారని తెలిపింది. అందులో ముగ్గురు వైద్య సహాయం తీసుకున్నారని.. మరెవరికీ ఆస్పత్రి చేరిక అవసరం కాలేదని సిడ్నీలోని ఎయిరిండియా మేనేజర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని