Air pollution: ఆయువును మింగేస్తోన్న వాయు కాలుష్యం..!

భారత్‌లో వాయుకాలుష్యం నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది. ప్రజల మనుగడకు ప్రాణసంకటంగా మారుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఉత్తర భారతీయుల

Published : 01 Sep 2021 17:12 IST

ఉత్తర భారతీయుల ఆయుర్దాయం 9ఏళ్లు తగ్గే అవకాశం

దిల్లీ: భారత్‌లో వాయుకాలుష్యం నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది. ప్రజల మనుగడకు ప్రాణసంకటంగా మారుతోంది. వాయు కాలుష్యం కారణంగా ఉత్తర భారతీయుల 9ఏళ్ల ఆయుష్సు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనూ సగటు మనిషి ఆయుర్దాయం దాదాపు మూడేళ్లు తగ్గే అవకాశముందని పేర్కొంది. 

ప్రజల ఆరోగ్యంపై కాలుష్యం ప్రభావాన్ని ఈ షికాగో విశ్వవిద్యాలయం అధ్యయనం చేసి ఎయిర్‌ క్వాలిటీ లైఫ్‌ ఇండెక్స్‌ నివేదిక రూపొందించింది. ప్రపంచంలోనే కాలుష్యం అత్యంత ఎక్కువగా ఉన్న దేశం భారత్‌ అని నివేదిక తెలిపింది. దాదాపు 40శాతం జనాభా(480 మిలియన్లు) నివసిస్తోన్న ఉత్తర భారత్‌లో కాలుష్య స్థాయిలో ప్రమాదకరంగా ఉన్నాయని పేర్కొంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ కాలుష్యం పెరిగిపోతోందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో 2019 నాటి కాలుష్య స్థాయిలు అలాగే కొనసాగితే ఇక్కడి ప్రజలు 9ఏళ్లకు పైగా ఆయుర్దాయాన్ని కోల్పోతారని నివేదిక పేర్కొంది. 

2019లో భారత సగటు కాలుష్య స్థాయిలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల్లో సూచించిన వాటికంటే ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. అంతేగాక, ఈ ప్రమాదం ఒక్క ఉత్తరభారతానికే పరిమితం కాలేదని, రోజులు గడుస్తోన్న కొద్దీ ఇతర భౌగోళిక ప్రాంతాలకూ వ్యాపిస్తోందని తెలిపింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లోనూ కాలుష్యం నానాటికీ పెరుగుతోందని, దీని వల్ల ఆ రాష్ట్రాల్లో సగటు మనిషి కనీసం 2.5 నుంచి 2.9 ఏళ్ల ఆయుష్షును కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. 

డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల్లో సూచించినట్లుగా కాలుష్యాన్ని తగ్గించుకుంటే భారత్‌ సహా బంగ్లాదేశ్‌, నేపాల్‌, పాకిస్థాన్‌లోని ప్రజలు 5.6ఏళ్లు ఎక్కువకాలం బతకొచ్చని నివేదిక వెల్లడించింది. భారత్‌లో అధిక జనాభాతో పాటు గత 20ఏళ్లలో ఇక్కడ వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని పేర్కొంది. దీనికి తోడు పంట వ్యర్థాలను కాల్చేయడం, ఇటుక బట్టీలు, ఇతర పారిశ్రామిక కార్యకలాపాల వల్ల ఈ ప్రాంతంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని