వైమానిక విన్యాసాలు.. ముగ్ధులైన వీక్షకులు

పాకిస్థాన్‌తో 1971 జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా తమిళనాడులోని సూలూరులో వైమానికదళం నిర్వహించిన స్వర్ణోత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనలు కట్టిపడేశాయి....

Published : 21 Feb 2021 23:48 IST

పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా ఎయిర్‌ ఫెస్ట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌తో 1971 జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా తమిళనాడులోని సూలూరులో వైమానికదళం నిర్వహించిన స్వర్ణోత్సవాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల ప్రదర్శనలు వీక్షకులను కట్టిపడేశాయి. పూర్తి స్వదేశీ విజ్ఞానంతో రూపొందించిన తేజస్‌-ఎమ్‌కే1 యుద్ధ విమానం ఈ విన్యాసాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వైమానికదళం ప్రదర్శించిన యుద్ధ తంత్రం సామాన్య ప్రజలను ఆశ్చర్యపరిచింది. గతేడాది నుంచి సూలూరు కేంద్రంగానే తేజస్‌ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో సైన్యాన్ని, సరకులను చేరవేసే రవాణా విమానం ఏఎన్‌-32 ఈ వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొంది. గగనతలంలో సూర్యకిరణ్‌ విమానాలతో చేసిన విన్యాసాలు వీక్షకులను విస్మయానికి గురిచేశాయి.

ఎయిర్‌ ఫెస్ట్ సందర్భంగా బలగాలు నిర్వహించిన విన్యాసాలు చూపు తిప్పుకోకుండా చేశాయి. అతి తక్కువ రేడియస్‌తో మెరుపు వేగంతో టర్న్‌ తీసుకోవడం, తక్కువ స్థలంలో ‘8’ ఆకృతిని సృష్టించడం, త్రిశూలం ఆకృతిని నిర్మించడం వంటి విన్యాసాలు భారత వైమానిక సామర్థ్యాన్ని కళ్లకుకట్టాయి. నక్సల్స్‌, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో బలగాలు అనుసరించే వ్యూహాలను ప్రదర్శించారు. హెలికాప్టర్ల నుంచి తాడు సాయంతో సైనికులు కిందకు దిగే దృశ్యాలు ఆకట్టుకున్నాయి. ఈ ఎయిర్‌ ఫెస్ట్‌ను చూసేందుకు తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని