Updated : 17 May 2021 15:04 IST

Covid: గాలి ద్వారా వ్యాప్తి.. వెంటిలేషనే శరణ్యం

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని గత ఏడాది కాలంగా నిపుణులు, శాస్త్రవేత్తలు చేస్తున్న వాదనలను ఇప్పుడు వైద్యాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. గాలి ద్వారా కొవిడ్‌ వ్యాప్తి జరగొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ఇటీవల తెలిపాయి. మరి అలాగైతే గాల్లో వైరస్‌ను నియంత్రించడం ఎలా..? వ్యాప్తి తీవ్రతను తగ్గించేదెలా? అంటే వెంటిలేషన్‌ ఒకటే మార్గమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 

1800 సంవత్సరంలో దుర్గంధమైన పైపుల వల్ల కలరా వ్యాపించిందని గుర్తించినప్పుడు ప్రజా నీటి సరఫరాను ఎలాగైతే సరిచేశారో.. ఇప్పుడు కూడా వెంటిలేషన్‌ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. ఇంటిలోపల గాలి స్వచ్ఛంగా ఉండటం వల్ల కేవలం కరోనా మాత్రమే కాకుండా.. ఫ్లూ, ఇతర శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గించొచ్చని చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ లిదియా మోరావ్‌స్కా సారథ్యంలో 14 దేశాలకు చెందిన 39 మంది శాస్త్రవేత్తలు కరోనాపై సుదీర్ఘ అధ్యయనం చేసి తమ పరిశోధనలను వెల్లడించారు. ఇండోర్‌ వెంటిలేషన్‌ వ్యవస్థను మెరుగుపర్చడం వల్ల అంటువ్యాధుల వ్యాప్తిని నివారించొచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ నూతన మార్గదర్శకాలు, భవనాలకు వెంటిలేషన్‌ ప్రమాణాలను రూపొందించాలని కోరుతున్నారు. 

ఏరోసోల్స్‌తో ప్రమాదమే..

దగ్గడం, తుమ్మడం, శ్వాసతీసుకోవడం, మాట్లాడటం, పాటలు పాడటం వంటివి చేసినప్పుడు కరోనా సోకిన వ్యక్తి ముక్కు, గొంతు నుంచి వైరస్‌ కణాలు బయటకు విడుదలవుతాయి. అందులోని పెద్ద పెద్ద కణాలు వేగంగా కిందకు పడి భూఉపరితలంపై చేరుకుంటాయి. కానీ కంటికి కన్పించని చిన్న చిన్న ఏరోసోల్స్‌ కణాలు మాత్రం గాల్లో ఉండిపోతాయి. ఇవి తేమ, ఉష్ణోగ్రత, గాలి వేగాన్ని బట్టి ప్రయాణిస్తుంటాయి. ఇవి గాల్లో ఎక్కువ గంటల ఉండిపోవడంతో పాటు గదుల్లో తొందరగా వ్యాపిస్తుంటాయి. ఇవే ప్రమాదకరంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భవనాల్లో వెంటిలేషన్‌ పెంచడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించొచ్చని అంటున్నారు. 

కరోనా వ్యాప్తి, దాన్ని అరికట్టడంపై డబ్ల్యూహెచ్‌వో ఇప్పటివరకు రెండుసార్లు మార్గదర్శకాలు సవరించింది. వ్యక్తుల మధ్య మూడు అడుగుల భౌతికదూరం పాటిస్తే వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని తెలిపింది. అయితే ఏరోసోల్స్‌ కణాలు ఉన్నప్పుడు భౌతికదూరం కూడా పనిచేయట్లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వెంటిలేషన్‌ తక్కువగా ఉన్న గదులు, ఎప్పుడూ మూసి ఉండే గదుల్లో ఏరోసోల్స్‌ ఎక్కువ కాలం గాల్లో ఉంటున్నాయని, అందువల్ల ఇండోర్‌లో పనిచేసే వారిలో ఎక్కువ మంది వైరస్‌ బారిన పడుతున్నారని తెలిపారు. 

అందుకే భవనాల్లోకి గాలి వెలుతురు ఎక్కువ వచ్చేలా చూసుకోవాలని అన్నారు. ఈ దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు రూపొందించాలని, భవనాల వెంటిలేషన్‌పై సరైన ప్రమాణాలు తయారుచేయాలని శాస్త్రవేత్తలు అభ్యర్థిస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో మరే మహమ్మారి ఎదురైనా పరిస్థితి ఇంతకంటే భయంకరంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని