అక్కడ ఇంటికో సొంత విమానం!

ఈ మధ్య కాలంలో గేటెట్‌ కమ్యూనిటీ ఇళ్లు పెరిగిపోయాయి. అక్కడ ఒకేలా ఉండే వందలాది ఇళ్లు. ఇంటికో కారు, కారు కోసం గ్యారేజీ తప్పనిసరిగా ఉంటాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని చిత్రమైన గేటెడ్‌ కమ్యూనిటీ ఇళ్లు ఉన్నాయి. అక్కడ ఇంటికో కారుతోపాటు విమానం కూడా ఉంటుంది. ఆ విమానాలు

Published : 17 Mar 2021 01:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ మధ్య కాలంలో గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లు పెరిగిపోయాయి. ఒకేలా ఉండే వందలాది ఇళ్లు. ఇంటికో కారు, కారు కోసం గ్యారేజీ తప్పనిసరిగా ఉంటాయి. కానీ, ప్రపంచవ్యాప్తంగా కొన్ని చిత్రమైన గేటెడ్‌ కమ్యూనిటీ ఇళ్లు ఉన్నాయి. అక్కడ ఇంటికో కారుతోపాటు విమానం కూడా ఉంటుంది. ఆ విమానాలు పార్క్‌ చేయడానికి ప్రతి ఇంటికి భారీ గ్యారేజీలు కనిపిస్తుంటాయి. స్థానికులు ఎక్కడికి వెళ్లాలన్నా సొంత విమానంలోనే వెళ్లి వస్తుంటారట. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఈ కమ్యూనిటీ ఇళ్లను ఎయిర్‌పార్క్‌ అని పిలుస్తుంటారు. ప్రపంచంలో ఇలాంటి ఎయిర్‌పార్క్‌లు దాదాపు 650 ఉంటాయని అంచనా. 

వాటిలో చెప్పుకోదగ్గ ఎయిర్‌పార్క్‌.. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న కామెరాన్‌ పార్క్‌. తాజాగా ఇక్కడి ఇళ్లను అమ్మకానికి పెట్టడంతో మరోసారి ఎయిర్‌పార్క్‌లు వార్తల్లోకెక్కాయి. ఒకప్పుడు ఈ కామెరాన్‌ పార్క్‌ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు నిర్మించారు. అయితే, దీన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడానికి అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పక్కనపెట్టేసింది. ఆ తర్వాత 61 ఎకరాల ఈ ఎయిర్‌పోర్టు చుట్టూ ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. పైలట్లు, విమానం నడిపించాలనే ఆసక్తి ఉన్నవాళ్లు, సంపన్నులు ఆ ఇళ్లను కొనుగోలు చేశారు. దాదాపు వంద ఇళ్లు ఉన్న ఈ ప్రాంతంలో జనరల్‌ ఏవియేషన్‌కు అనుమతి ఉండటంతో చిన్నపాటి విమానాలను సొంతగా నడిపించుకునే అవకాశం ఉంది. అలా పైలట్లు, డబ్బులున్న వాళ్లంతా చిన్న విమానాలను కొనుగోలు చేశారు. వాటిని పార్క్‌ చేసుకునేలా ఇంటికి ఆనుకొని భారీ గ్యారేజీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి ప్రధాన రన్‌వేకి వెళ్లడానికి చిన్న చిన్న రన్‌వేలు.. విమానాలు ఢీ కొట్టుకోకుండా 100 అడుగుల వెడల్పుతో రోడ్లు ఉన్నాయి. ఇక్కడి 98శాతం విమానాలను కుటుంబాలు వ్యక్తిగతంగా ఉపయోగిస్తుండగా.. 2 శాతం విమానాలు ట్యాక్సీ సేవలు అందిస్తున్నాయి. విమానం ల్యాండింగ్‌ చేసుకోవడానికి వీలుండే ఏ చోటుకైనా గాల్లో ప్రయాణిస్తూ వెళ్లిపోవచ్చు. 






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని