
Ajit Doval: పాక్ ఉగ్రవాద సంస్థలపై కఠిన పోరు..!
షాంఘై సహకార సంస్థ భేటీలో భారత్
దిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేయడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్యాచరణ అవసరమని భారత్ అభిప్రాయపడింది. ఉగ్రవాద సంస్థలు వినియోగించే డార్క్‌వెబ్ టెక్నాలజీ, డ్రోన్ల నుంచి ఆయుధాల వరకు పర్యవేక్షణ ఉంచాలని పేర్కొంది. ముఖ్యంగా పాకిస్థాన్ కేంద్రంగా ఉన్న లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల కట్టడికి అంతర్జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేక ప్రణాళిక అవసరమని భారత్ స్పష్టం చేసింది. ఇందుకోసం తజకిస్థాన్‌లో జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో ఓ ప్రణాళిక ప్రతిపాదించిన భారత్, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికి సమిష్టిగా ముందుకు వెళ్లాలని ఎస్సీఓ సభ్యదేశాలకు పిలుపునిచ్చింది.
ప్రపంచదేశాల భద్రతకు పెనుముప్పుగా తయారైన ఉగ్రవాదంపై పోరు, అందుకు కావాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఎనిమిది సభ్యదేశాలతో కూడిన షాంఘై సహకార సంస్థ (SCO) తజకిస్థాన్‌లో భేటీ అయ్యింది. రెండు రోజులపాటు జరుగుతోన్న ఈ సమావేశంలో సభ్యదేశాల భద్రతా అధికారులు, సలహాదారులు పాల్గొన్నారు. భారత్ తరపున ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు (NSA) చీఫ్ అజిత్ ఢోబాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన ఢోబాల్.. ఎల్ఈటీ, జేఈఎంల కట్టడికి కచ్చితమైన ప్రణాళిక ఉండాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థలకు ఆర్థిక మూలాలను నియంత్రించడం కోసం ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(FATF) వంటి విభాగాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీటితోపాటు ఇప్పటికే ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మాణాలను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అజిత్ ఢోబాల్ స్పష్టం చేశారు.
ఇక 2001 సంవత్సరంలో చైనాలో ఏర్పాటైన షాంఘై సహకార సంస్థ (SCO)లో రష్యాతో పాటు మొత్తం ఎనిమిది దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఇందులో తొలుత భారత్ పరిశీలన దేశంగా ఉన్నప్పటికీ 2017 నుంచి సభ్యదేశంగా కొనసాగుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.