Ajit Doval: జాతీయ భద్రత సలహాదారుగా అజిత్‌ డోభాల్‌ పునర్నియామకం

జాతీయ భద్రత సలహాదారు (NSA)గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అజిత్‌ డోభాల్‌ను కేంద్రం పునర్నియమించింది.

Updated : 13 Jun 2024 20:22 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సారథ్యంలో కేంద్రంలో నూతన సర్కారు కొలువుదీరింది. ఈ క్రమంలోనే దేశ భద్రత అంశానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత సలహాదారు (NSA)గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అజిత్‌ డోభాల్‌ (Ajit Doval)ను మరోసారి నియమించింది. ‘ఎన్‌ఎస్‌ఏ’గా ఆయన నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. దీంతోపాటు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీకే మిశ్రాను ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పదవిలో కొనసాగిస్తూ.. అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

2024 జూన్‌ 10 నుంచి మొదలుకొని ప్రధాని మోదీ పదవీకాలం పూర్తయ్యేవరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు డోభాల్‌ ఎన్‌ఎస్‌ఏగా ఉంటారని సిబ్బంది వ్యవహారాలశాఖ పేర్కొంది. పదవీకాలంలో ఆయనకు క్యాబినెట్ మంత్రి హోదాను కేటాయిస్తారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే తొలిసారి అధికారంలో వచ్చిన సమయంలో 2014 మే 30న డోభాల్‌ తొలిసారి ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేశారు.

భారత్‌లా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం..? పాక్‌ నేత వీడియో వైరల్‌

ఉత్తరాఖండ్​(ఒకప్పటి ఉమ్మడి ఉత్తరప్రదేశ్)లో 1945లో జన్మించారు డోభాల్. 1968 బ్యాచ్ ​కేరళ కేడర్ ఐపీఎస్ అధికారిగా వృత్తిజీవితం మొదలుపెట్టి.. 2005లో ఐబీ డైరెక్టర్‌గా పదవీవిరమణ పొందారు. 2014లో మోదీ ప్రభుత్వంలో అయిదో జాతీయ భద్రత సలహాదారుగా నియమితులయ్యారు. 2016లో పీఓకేలో భారత్ ​జరిపిన లక్షిత దాడులు, 2019లో బాలాకోట్‌ వైమానిక దాడుల్లో కీలకంగా వ్యవహరించారు. డోక్లాం విషయంలో చైనాతో పరిస్థితులను చక్కబెట్టడంలో కృషి చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని