Anil K Antony: బీబీసీ డాక్యుమెంటరీపై ట్వీట్‌.. కాంగ్రెస్‌ను వీడిన ఏకే ఆంటోనీ తనయుడు

బీబీసీ డాక్యుమెంటరీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత అనిల్‌ ఆంటోనీ(Anil K Antony). దానిని వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో ఆయన హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు.

Published : 25 Jan 2023 11:02 IST

దిల్లీ: ప్రధాని మోదీ(Modi)పై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈ డాక్యుమెంటరీని వ్యతిరేకిస్తూ పోస్టు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ(AK Antony) తనయుడు అనిల్ (Anil K Antony).. బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. తాను చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలంటూ వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

బీబీసీ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులన్నింటిని బ్లాక్‌ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే సామాజిక మాధ్యమ సంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. దీనిని సెన్సార్‌షిప్‌ అంటూ విపక్షాలు తప్పుపడుతున్నాయి. నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయంటూ కాంగ్రెస్‌(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కూడా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో గాంధీ కుటుంబ సన్నిహితుడు ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ నుంచి మోదీకి అనూహ్య మద్దతు లభించింది. భాజపాతో అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ.. రాజ్యాంగ సంస్థలపై బీబీసీ అభిప్రాయాలు వెల్లడించడం మన సార్వభౌమత్వాన్ని అణగదొక్కడం కిందికే వస్తుందంటూ తీవ్రంగా స్పందించారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి తెలిసిందే.

ఇక అనిల్(Anil K Antony) చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు. ‘కాంగ్రెస్‌లో నేను నిర్వహిస్తోన్న అన్ని బాధ్యతల నుంచి వైదొలుగుతున్నాను. వాక్‌ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారి నుంచే నేను చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకోవాలనే ఒత్తిడి వచ్చింది. అందుకు నేను నిరాకరించాను’ అంటూ అనిల్ తన రాజీనామా లేఖను పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని