Akhilesh Yadav: నా హెలికాఫ్టర్‌ను వెళ్లనివ్వలేదు.. ఇది భాజపా కుట్రే..!

ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయపార్టీల విమర్శలు, ప్రతి విమర్శల డోసు రోజురోజుకూ పెరిగిపోతోంది.

Published : 28 Jan 2022 18:34 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయపార్టీల విమర్శలు, ప్రతి విమర్శల డోసు రోజురోజుకూ పెరిగిపోతోంది. భాజపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తాజాగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. తన హెలికాఫ్టర్‌ను దిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు వెళ్లకుండా కుట్రపన్నారని నిందించారు. 

‘ఏ కారణం లేకుండా దిల్లీలో నా హెలికాఫ్టర్ నిలిపివేశారు. దిల్లీ నుంచి ముజఫర్‌నగర్ వెళ్లేందుకు అనుమతించలేదు. కానీ భాజపా నేతలు ఇక్కడి నుంచి వెళ్లడానికి అనుమతి లభించింది. ఇది భాజపా కుట్రలో భాగమే.  ప్రజలకు అన్నీ తెలుసు’ అని అఖిలేశ్ ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ అనుభవం ఎదురైనట్లు చెప్పారు. అలాగే హెలికాఫ్టర్ ముందు దిగిన ఫొటోను షేర్ చేశారు.

ఆ తర్వాత చేసిన మరో ట్వీట్‌లో.. ‘అధికార దుర్వినియోగం ఓటమికి దగ్గరగా ఉన్న వ్యక్తుల లక్షణం. ఈ రోజు.. సమాజ్‌వాదీ పార్టీ చరిత్రలో నమోదవుతుంది. మేం విజయవైపు పయనించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని హెలికాఫ్టర్ వైపు వెళ్తోన్న చిత్రాన్ని పోస్టు చేశారు. ఆ ట్వీట్లను బట్టి ఆయన ప్రయాణం కొద్దిసేపు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.

ఫిరాయింపులు, మాటల తూటాలతో యూపీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఫిబ్రవరి 10 నుంచి ఆ రాష్ట్రంలో ఏడుదశల్లో ఓటింగ్‌ జరగనుంది. మార్చి 10న కౌటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో భాజపా అధికార పీఠాన్ని నిలుపుకోవాలని పావులు కదుపుతుండగా.. ఎస్పీ మరోసారి అధికారంలోకి రావాలని సరికొత్త వ్యూహాలు అమలు చేస్తోంది.     

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని