Akhilesh Yadav: అఖిలేశ్‌ యాదవ్‌.. ఎంపీగానా..? ఎమ్మెల్యేగానా..?

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి అరంగేట్రం లభించింది. తొలిసారిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అఖిలేశ్‌..

Published : 13 Mar 2022 01:55 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో మంచి అరంగేట్రం లభించింది. తొలిసారిగా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అఖిలేశ్‌.. కర్హాల్‌ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. అయితే ఇప్పటికే ఆయన యూపీలోని ఆజంగఢ్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆయన ఏదో ఒక పదవికి రాజీనామా చేయాలి. మరి అఖిలేశ్‌.. ఎమ్మెల్యేగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారా? లేదా ఎంపీగా కొనసాగి 2024 ఎన్నికలపై దృష్టిపెడతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

అఖిలేశ్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నేత ఆజం ఖాన్‌ కూడా తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాంపూర్‌ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆజంఖాన్‌.. శాసనసభ ఎన్నికల్లో రాంపూర్‌ స్థానం నుంచే పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన కూడా ఇప్పుడు ఒక పదవికి రాజీనామా చేయాల్సిందే. 

అయితే వీరిద్దరూ లోక్‌సభ సభ్యులుగానే కొనసాగే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం లోక్‌సభలో ఎస్పీ నుంచి కేవలం ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దిగువసభలో పార్టీని బలహీనపర్చొద్దని అఖిలేశ్‌ భావిస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో వీరు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా.. అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ బాధ్యతలను శివపాల్‌ యాదవ్‌కు అప్పగించే అవకాశాలున్నట్లు సదరు వర్గాలు చెబుతున్నాయి. శాసనసభలో ప్రతిపక్ష నేతగా శివపాల్‌ను ఎన్నుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. 

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కూటమి 125 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు చాలా దూరంలో ఆగిపోయినప్పటికీ.. గత ఎన్నికలతో పోలిస్తే ఎస్పీ సీట్లు రెండున్నర రెట్లు పెరగడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని