Al-Qaeda: అమెరికాపై మళ్లీ అల్‌ఖైదా పడగ..!

ఉగ్రముప్పును నిర్మూలించడం ద్వారా అఫ్గానిస్థాన్‌లో తమ లక్ష్యం నెరవేరిందని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించినప్పటికీ ఇది నూరు శాతం నిజం కాదనే వాదనలు వినిపిస్తూనే

Published : 16 Sep 2021 02:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉగ్రముప్పును నిర్మూలించడం ద్వారా అఫ్గానిస్థాన్‌లో తమ లక్ష్యం నెరవేరిందని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించినప్పటికీ ఇది నూరు శాతం నిజం కాదనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఆ దేశ నిఘా సంస్థ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. అల్‌ఖైదాతో అమెరికాకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. తాలిబన్ల సంరక్షణలో అఫ్గాన్‌ గడ్డపై అల్‌ఖైదా తమను తాము పునర్‌ నిర్మించుకునే అవకాశం ఉందని, రానున్న ఒకటి రెండేళ్లలో అమెరికా భూభాగంపై దాడులు చేసే ప్రమాదం కూడా ఉందని అమెరికా నిఘా సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ కథనం వెల్లడించింది. 

‘‘అఫ్గానిస్థాన్‌లో వనరులను సమకూర్చుకునేందుకు అల్‌ఖైదా అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండేళ్లలో ఆ ముఠా మళ్లీ క్రియాశీలకంగా మారి అమెరికాను బెదిరించే స్థాయికి చేరే అవకాశముంది’’ అని సదరు అధికారి చెప్పినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. అటు సీఐఏ డిప్యూటీ డైరెక్టర్‌ డేవిడ్‌ కోహెన్‌ కూడా ఈ విషయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అఫ్గాన్‌ భూభాగంలో అల్‌ఖైదా కార్యక్రమాలు ప్రారంభించిందని కోహెన్‌ తెలిపారు. అయితే నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ అవ్రిల్‌ హేయిన్స్‌ మాత్రం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ‘‘అమెరికాకు ముప్పు పొంచి ఉన్న దేశాల జాబితాలో ప్రస్తుతానికి అఫ్గానిస్థాన్‌ లేదు. యెమెన్‌, సోమాలియా, సిరియా ఇరాక్‌ దేశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది’’ అని ఆయన అన్నారు.

ఏడాది కాలంగా చనిపోయాడనుకున్న అల్‌ఖైదా అగ్రనేత ఐమన్‌ అల్‌- జవహరీ ఇటీవల ఓ వీడియోలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. జిహాదీ బృందాల ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై నిఘా పెట్టిన ‘సైట్‌’ అనే ఇంటెలిజెన్స్‌ గ్రూప్‌ గతవారం విడుదల చేసిన ఓ వీడియోలో జవహరీ పలు అంశాలపై మాట్లాడారు. 9/11 దాడుల స్మారకదినం రోజునే ఈ వీడియో బయటకు రావడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరికలు మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. 

2001 సెప్టెంబరు 11న అమెరికాపై అల్‌ఖైదా భీకర దాడి జరిపింది. ఈ దాడితో ప్రతీకారం పెంచుకున్న అగ్రరాజ్యం.. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ సంబంధాలను నిర్మూలించడమే లక్ష్యంగా అఫ్గాన్‌ భూభాగంలో అడుగుపెట్టింది. అక్కడ తాలిబన్లను పడగొట్టి పౌర ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. 2011లో పాక్‌లో నక్కిన ఒసామా బిన్‌ లాడెన్‌ను మట్టుబెట్టింది. ఆ తర్వాత కూడా అఫ్గాన్‌లో అమెరికా దళాలు కొనసాగాయి.

అయితే 20ఏళ్ల సుదీర్ఘ విరామానికి ముగింపు పలకాలనే ఉద్దేశంతో తాలిబన్లతో అగ్రరాజ్యం శాంతి ఒప్పందం చేసుకుంది. ఈక్రమంలోనే అఫ్గాన్‌ భూభాగం నుంచి అమెరికా బలగాలు నిష్క్రమించాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న తాలిబన్లు.. ఒక్కసారిగా పేట్రేగిపోయారు. పౌర ప్రభుత్వాన్ని పడగొట్టి దేశాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. దీంతో మరోసారి ఆ దేశం ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారే అవకాశముందని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని