దండెత్తిన చైనా మూక..!

‘‘దక్షిణ చైనా సముద్రంలో షీజిన్‌పింగ్‌ చేపలు వేటాడతామంటే.. ఎవరు అడ్డుకోగలరు. నేను మా మెరైన్లను చైనా మత్సకారులపైకి పంపితే.. నేను గ్యారెంటీగా చెబుతా ఒక్కరు కూడా సజీవంగా తిరిగి రారు’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.

Updated : 24 Mar 2021 15:31 IST

హడలిపోయిన ఫిలిప్పీన్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

‘‘దక్షిణ చైనా సముద్రంలో జిన్‌పింగ్‌ చేపలు వేటాడతానంటే.. ఎవరు అడ్డుకోగలరు..! నేను మా మెరైన్లను చైనా మత్సకారులపైకి పంపితే.. నేను గ్యారెంటీగా చెబుతా.. ఒక్కరు కూడా సజీవంగా తిరిగి రారు’’ ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి. ఓ సందర్భంలో ఆయన సరదాగా వ్యాఖ్యలు చేశారు.  చైనాతో స్నేహపూర్వకంగా వ్యవహరిద్దామన్న ఉద్దేశంతో ఆయన రెండేళ్ల క్రితం అలా వ్యాఖ్యానించారు. ఇప్పుడు అవే నిజమయ్యే పరిస్థితి వచ్చింది. 

దక్షిణ చైనా సముద్రంలో చైనా మరోసారి తన అరాచకాలను ప్రదర్శించింది. మార్చి 7వ తేదీన వివాదాస్పద జూలియన్‌ ఫిలిప్పే ద్వీపం వద్దకు 220కి పైగా చైనా చేపల వేట ఓడలు తరలి వచ్చాయి. సైజులో చైనా చేపలవేట ఓడలు చిన్నసైజు యుద్ధనౌకలను తలిపిస్తుంటాయి. వీటికి చైనా కోస్టుగార్డు మద్దతు ఉంది. ఈ విషయాన్ని ఫిలిప్పీన్స్‌ రక్షణ శాఖ ప్రకటించింది. ఆ దేశ రక్షణ మంత్రి డెల్ఫెన్‌ లోరెన్జాన మాట్లాడుతూ ఫిలిప్పీన్స్‌ సముద్ర హక్కులను చైనా ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. అక్కడకు వచ్చినవారు మత్సకారులు కాదని.. చైనా సముద్రపు దుండగుల మూక అని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఎక్స్‌క్లూజీవ్‌ ఎకనామిక్‌ జోన్‌ పరిధిలోనే ఈ ద్వీపం ఉంటుంది. దీంతో ఫిలిప్పీన్స్‌ మిలటరీ చీఫ్‌ కూడా స్పందించారు. తమ దేశ ప్రజలు, భూభాగాన్ని కాపాడటమే ప్రధమ లక్ష్యమని పేర్కొన్నారు. చైనాకు ఫిలిప్పీన్స్‌ దౌత్యపరమైన నిరసన వ్యక్తం చేసింది. 

ఉదాసీనతే అలుసుగా తీసుకొని..

దక్షిణ చైనా సముద్రంలో చైనా అరాచకాలపై అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లిన దేశం ఫిలిప్పీన్స్‌. అంతకుముందు ఫిలిప్పీన్స్‌ నౌకాదళం చైనా పడవలను అడ్డుకొంది.  దీంతో 2012లో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది. ఫిలిప్పీన్స్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనుకుని చైనా ఓ ఎత్తుగడ వేసింది. ఫిలిప్పీన్స్‌ రైతులు పండించే అరటి పండ్లకు చైనానే అతిపెద్ద మార్కెట్‌. దీంతో ఫిలిప్పీన్స్‌ అరటిపండ్ల నాణ్యతకు వంకలు పెట్టి కొనుగోళ్లను తగ్గించింది. వందల కొద్దీ కంటైనర్లను తిప్పి పంపడం మొదలుపెట్టింది. అపరిశుభ్రంగా ఉన్నాయని కొన్నింటిని ధ్వంసం కూడా చేసింది. తర్వాత ఇతర పండ్లను కొనేందుకు కూడా సాకులు చూపడం మొదలుపెట్టింది. దీంతో ఫిలిప్పీన్స్‌లోని కొన్ని లక్షల మంది రైతులు అవస్థలు పడ్డారు. బిలియన్ల డాలర్ల కొద్దీ నష్టం వాటిల్లింది. 2016లో తాము అమెరికాకు దూరం అయ్యే అవకాశాలున్నాయని ఫిలిప్పిన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి సంకేతాలు ఇవ్వడంతో చైనా శాంతించింది. దిగుమతులను పెంచింది.

రోడ్రిగా డ్యుటెరెట్టిపై విమర్శలు..

అధ్యక్షుడు రోడ్రిగా డ్యుటెరెట్టి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైనాతో స్నేహంగా ఉండేందుకు.. వీలైనంత ఉదాసీనంగా వ్యవహరించారు. అయినా చైనా తీరులో ఏమాత్రం తేడారాలేదు. దక్షిణ చైనా సముద్రం తమదే అన్న వాదనలో ఏమాత్రం తగ్గలేదు. 2016తీర్పును మాత్రం గుర్తించేది లేదని తెగేసి చెప్పింది. మరోపక్క రక్షణ భాగస్వామిగా ఉన్న అమెరికాతో ఒప్పందాలను రద్దు చేసుకొనేందుకు  కూడా డ్యుటెరెట్టి ప్రయత్నించారు. ఈ చర్య మిత్రదేశమైన అమెరికాను దూరం చేసిందే తప్ప చైనాను దగ్గర చేయలేదు. 

పొరుగు దేశాలను భయపెట్టే చట్టం..

పొరుగు దేశాలను భయపెట్టేలా చైనా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కోస్టుగార్డ్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. చైనా తనవిగా ప్రకటించుకొన్నజలాల్లోకి వచ్చే విదేశీ నౌకలను  కోస్టుగార్డులు అదుపు చేయవచ్చు. చైనా కోస్టుగార్డులు వాటిని తనిఖీ చేయడం, అవసరమైతే కాల్పులు జరపడం, ధ్వంసం చేయడం వంటివి చేసే అధికారం ఇచ్చింది. చైనాకు దక్షిణ చైనా సముద్రంలో పలు వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏది చైనా జలాలో.. ఏవి పొరుగుదేశ జలాలో అర్థం కాని పరిస్థితి. ఈ సమయంలో చైనా బలగాలు బలప్రదర్శనకు దిగవచ్చని పొరుగు దేశాలు ఆందోళన చెందుతున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని