Alcohol: ఎంపీ విందులో ఉచితంగా ‘మద్యం’.. ఎగబడిన జనం!

కర్ణాటకలో ఓ భాజపా ఎంపీ అనుచరులు ఉచితంగా ‘మద్యం’ పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది.

Updated : 08 Jul 2024 23:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో భాజపా ఎంపీ మద్దతుదారులు ఏర్పాటు చేసిన కార్యక్రమం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కార్యక్రమంలో ఉచితంగా ‘మద్యం’ పంపిణీ చేయడం చర్చనీయాంశమయ్యింది. దీనికి భారీ సంఖ్యలో మందు ప్రియులు క్యూ కట్టగా.. పోలీసులే బందోబస్తు నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో భాజపాపై తీవ్ర విమర్శలు గుప్పించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. ఈ వ్యవహారంపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కర్ణాటక మాజీ మంత్రి, భాజపా నేత కె.సుధాకర్‌ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబళ్లాపుర్‌ నుంచి విజయం సాధించారు. ఈ సందర్భంగా స్థానికంగా కృతజ్ఞత కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆయన మద్దతుదారులు.. ఉచితంగా మద్యం పంపిణీ చేపట్టారు. దీనికి జనం ఎగబడ్డారు. భారీ ‘క్యూ’ లైను ఉండగా.. ఆ తతంగాన్నంతా పోలీసులు పర్యవేక్షించారు. అయితే, ఈ కార్యక్రమానికి బందోబస్తు నిర్వహించాలని ఎంపీ సుధాకర్‌ స్థానిక పోలీసులకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారంపై స్పందించిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌.. భాజపాపై మండిపడ్డారు. ఆ పార్టీ సంస్కృతి ఇదేనని ఆరోపించిన ఆయన.. దీనిపై జేపీ నడ్డా స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలను అతిక్రమించినందుకు చర్యలు తీసుకుంటారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆ విషయం తర్వాత అని, తొలుత కాషాయ పార్టీ నుంచి ఎటువంటి సమాధానం వస్తోందో చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని